సహకరించండి

– రాజకీయపార్టీలతో ఈసీ భేటీ
– 10వ తేదీ తర్వాత పోల్‌ స్లిప్‌ల పంపిణీ
– 33.43 లక్షల ఓటరు గుర్తింపు కార్డుల పంచేశాం
– 1961 ఫిర్యాదులు పరిష్కారం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు రాజకీయపార్టీలు సహకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ విజ్ఞప్తి చేశారు. బుధవారంనాడాయన వివిధ రాజకీయపార్టీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎన్నికల సంఘం అడిషనల్‌ సీఈఓ లోకేష్‌కుమార్‌, జాయింట్‌ సీఈఓ సర్ఫరాజ్‌ అహ్మద్‌, డిప్యూటీ సీఈఓ సత్యవాణి, సీపీఎం ప్రతినిధిగా నంద్యాల నర్సింహారెడ్డితో పాటు ఇతర పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తదితర అంశాలకు సంబంధించిన విధివిధానాలను అధికారులు వారికి తెలిపారు. నామినేషన్ల పరిశీలన సమయంలో అభ్యర్థితో పాటు రాతపూర్వకంగా ధృవీకరించిన ఎన్నికల ఏజెంట్‌, ప్రపోజర్‌తో పాటు మరో వ్యక్తిని అనుమతిస్తామని వివరించారు. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో అభ్యర్థి స్వయంగా రావొచ్చనీ, సాధ్యం కానిపక్షంలో రాతపూర్వక అనుమతితో పోలింగ్‌ ఏజెంట్‌, ప్రపోజర్‌ను అనుమతిస్తామన్నారు. అన్ని రాజకీయపార్టీలు మూడు కాపీల ఎన్నికల మ్యానిఫెస్టోల్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని చెప్పారు. సువిధ పోర్టల్‌ ద్వారా ఇప్పటి వరకు 10,760 అనుమతులు ఇచ్చామన్నారు. పత్రికలు, చానళ్లలో ప్రకటనల కోసం మూడు రోజుల ముందు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 43.21 లక్షల ఓటరు గుర్తింపు కార్డులు అప్రూవ్‌ అయ్యాయనీ, మొత్తంగా 45.6 లక్షల గుర్తింపు కార్డులు ముద్రించి, 33.43 లక్షల కార్డుల్ని పోస్టు ద్వారా పంపించేశామని వివరించారు. మిగిలిన కార్డుల్ని ఈనెల 15వ తేదీ నాటికి బట్వాడా చేస్తామన్నారు. ఓటర్లకు పోల్‌ స్లిప్పుల్ని ఈనెల 10వ తేదీ తర్వాతి నుంచి ఇంటింటికీ తిరిగి అందచేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై 3.205 ఫిర్యాదులు అందా యనీ, వాటిలో 1,961 ఫిర్యాదుల్ని పరిష్కరించామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన ఇతర ఏర్పాట్లన్నింటినీ త్వరలో పూర్తిచేస్తామని అన్నారు.
రూ.525 కోట్ల సొత్తు స్వాధీనం
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.525.10 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. దీనిలో రూ.179.86 కోట్ల నగదుతో పాటు అక్రమంగా తరలిస్తున్న మద్యం, మత్తు పదార్థాలు, బంగారం, వెండి, ఆభరణాలు, ఉచితాలు వంటి అనేక వస్తువులున్నాయని వివరించారు. తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు.

Spread the love