ఫార్మసిస్టుల కౌన్సిలింగ్‌ షురూ…

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్య శాఖలో 310 ఫార్మసిస్టు పోస్టులకు కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 105 పోస్టులకు అధికారులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ (టీవీవీపీ) పరిధిలోని 135 పోస్టులకు, డీఎంఈ పరిధిలోని 70 పోస్టులకు శుక్రవారం కౌన్సిలింగ్‌ జరుగనుంది. వీరికి త్వరలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌ రావు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 369 ఫార్మసిస్ట్‌ పోస్టుల భర్తీకి 2018 జనవరి 25న టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో డీపీహెచ్‌ పరిధిలో 125, డీఎంఈ 96, టీవీవీపీలో 148 పోస్టులు ఉన్నాయి. అయితే కోర్టు కేసుల కారణంగా ఫలి తాల వెల్లడి ఆలస్యమైంది. ఇందులో 310 పోస్టుల భర్తీకి న్యాయస్థానం తాజాగా అనుమతిచ్చింది. దీంతో టీఎస్‌పీఎస్సీ ఈ నెల 12వ తేదీన 310 పోస్టులకు ఎంపిక కాబడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందు లో డీపీహెచ్‌ పరిధిలో 105, డీఎంఈ పరిధిలో 70, టీవీవీపీ పరిధిలో 135 పోస్టులు ఉన్నాయి. వీరికి కౌన్సిలింగ్‌ నిర్వహించి కోరుకున్న చోట పోస్టింగ్‌ ఇవ్వడం జరుగుతుంది. ఫార్మసిస్టులుగా నియమితులవుతున్న వారికి మంత్రి హరీష్‌ రావు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌ మార్గ నిర్దేశనలో వైద్యారోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని,మంచి సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని మంత్రి సూచించారు.

Spread the love