‘నకిలీ’ గుట్టురట్టు..అక్రమంగా నకిలీ విత్తనాలు విక్రయాలు

– రెండు ముఠాలకు చెందిన 15మంది అరెస్ట్‌
– పరారీలో మరో ముగ్గురు నిందితులు
– రూ.2.11 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్‌ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాల గుట్టును వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పోలీసులు రట్టు చేశారు. రెండు ముఠాలకు చెందిన 15 మందిని అరెస్ట్‌ చేయగా మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌, మడికొండ, ఎనుమాముల పోలీసులు, వ్యవసాయ శాఖాధికారులతో కలిసి సంయుక్తంగా నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.2.11 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు, 7 టన్నుల విడి విత్తనాలు, 9,765 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, ఒక డీసీఎం, ఒక కారు, రూ.21 లక్షల నగదు, నకిలీ విత్తనాల పాకెట్ల తయారీ కొరకు అవసరమైన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలిస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాధ్‌ వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాకు చెందిన దాసరి శ్రీనివాస్‌, తాప్తే హనుమంతు, హైదరాబాద్‌కు చెందిన చేడం పాండు, వెంకటరమణ, వేముల అరవింద్‌రెడ్డి, మంచిర్యాలకు చెందిన కొప్పుల రాజేష్‌, బోగే సత్యం, షేక్‌ అమ్జద్‌, ఇందుర్తి వెంకటేశ్‌, పుట్ట రాజేశం, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన వడిచర్ల సురేందర్‌రెడ్డి, బల్లార్షకు చెందిన ఎన్నూడే దిలీస్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన చేడాం నాగరాజు, బాపట్లకు చెందిన సుందర్‌శెట్టి ఫణీందర్‌, నాగర్‌కర్నూల్‌కు చెందిన కాల్వ శ్రీధర్‌, అరెస్ట్‌ చేయగా శివారెడ్డి, భాస్కర్‌రెడ్డి, గంప సదాశివ్‌ పరారీలో ఉన్నారు. ఒక ముఠాలోని సభ్యులు రైతుల నుంచి తక్కువ ధరకు విడిగా విత్తనాలు కొనుగోలు చేసి వాటిని ఈ ముఠాలోని ప్రధాన నిందితులు దాసరి శ్రీనివాసరావు, భాస్కర్‌రెడ్డి కర్నాటకలో నిర్వహిస్తున్న విత్తన కంపెనీలకు తరలించి అక్కడ విత్తన శుద్ది చేయించేవారు. వాటిని వివిధ రకాల విత్తన కంపెనీల పేర్లతో ప్యాక్‌ చేసి వరంగల్‌ నగరానికి తీసుకువచ్చేవారు. ఇక్కడి నుంచి తెలంగాణ, మహారాష్ట్రల్లోని జిల్లాలకు చెందిన విత్తన డీలర్లు, రైతులకు విక్రయించేవారు. మరో ముఠాకు చెందిన ప్రధాన నింది తులు చేడాం పాండుకు ప్రభుత్వ అనుమతులు కలిగిన రుషి, శ్రీగణేష్‌ విత్తన శుద్ధి కంపెనీలున్నాయి. కాగా, గుజరాత్‌లోని నర్మదాసాగర్‌ కంపెనీకి ఉప విక్రయ లైసెన్స్‌దారుగా ఉన్న ఇతను.. సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో నర్మదాసాగర్‌ కంపెనీకి చెందిన విత్తన పాకెట్లను తీసిపోని విధంగా క్యూఆర్‌ కోడ్‌, విత్తన తయారీ, గడువు తారీఖులు, క్రమ సంఖ్య, ఎంఆర్‌పీలతో కూడిన నకిలీ నర్మదా విత్తన ప్యాకెట్లను తయారు చేసి విక్రయించారు. పోలీసులకు అందిన పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌, మడికొండ, ఎనుమాముల పోలీసు అధి కారులు, వ్యవసాయాధికారులు రెండు బృందాలుగా ఏర్పడి బుధవారం నిందితులను అరెస్టు చేసి విచారించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస రావు, జనార్ధన్‌రెడ్డి, అల్లం రాంబాబు, ఎస్‌. శ్రీనివాస్‌, వేణు, మహేందర్‌, ఎస్‌ఐలు దేవేందర్‌, భూక్యా చందర్‌, బండారి సంపత్‌, శరత్‌కుమార్‌, లవన్‌కుమార్‌, రాజు, శ్రీకాంత్‌, తదితరులను సీపీ అభినందించారు.

Spread the love