నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న ముఠా అరెస్ట్‌

– 2.65 టన్నుల నకిలీ విత్తనాలు సీజ్‌
–  అందమైన ప్యాకెట్ల లేబుల్స్‌తో బురిడీ
–  అగ్రికల్చర్‌, సైబరాబాద్‌ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌
– వివరాలను వెల్లడించిన సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీందర్‌
నవతెలంగాణ-మియాపూర్‌
నకిలీ పత్తి విత్తనాలను అందమైన ప్యాకెట్లు లేబుల్స్‌తో రైతులను బురిడీ కొట్టించే ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2.65 టన్నుల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీందర్‌ శుక్రవారం వెల్లడించారు. సదాశివారెడ్డి, తాయప్ప, రాంచందర్‌, సురేష్‌ ఒక ముఠాగా ఏర్పడ్డారు. కర్నాటకకు చెందిన కొందరు ఒక బులెరా వాహనం ద్వారా మేడ్చల్‌-మల్కాజిగిరిలో నకిలీ విత్తనాలను మార్కెట్‌లో అమ్ముతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్‌, బాచుపల్లి, షాబాద్‌ తదితర ప్రాంతాల్లో సైబరాబాద్‌ కమిషరేట్‌ సిబ్బంది, మేడ్చల్‌, రంగారెడ్డి వ్యవసాయ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠాను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 85 లక్షల విలువ చేసే నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. బీటీ కాటన్‌కు మార్కెట్‌లో అధిక డిమాండ్‌ ఉండటంతో ఈ విత్తనాలపై నకిలీ విత్తన తయారీదారులు దృష్టి సారించి, కర్టన్‌ విత్తనాల పేరుతో వీటిని మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు.
షాబాద్‌లో మరో ముఠా అరెస్ట్‌
ఇదే తరహా షాబాద్‌లో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి 25బాగ్స్‌లో 1,250 కేజీల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. దౌల్తాబాద్‌కు చెందిన గట్టమానేని వెంకట్‌ రమణను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్‌ ఆఫీసర్స్‌ మాట్లాడుతూ.. రైతులను మోసం చేయడానికి ఇలాంటి నకిలీ విత్తనాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నారని తెలిపారు. అందమైన ప్యాకింగ్‌ లేబుల్స్‌తో రైతులను బురిడీ కొట్టిస్తున్నారన్నారు. రైతులు కేవలం గుర్తింపు పొందిన డీలర్‌ వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత విత్తన ప్యాకెట్‌ కొనుగోలుకు సంబంధించిన రసీదును భద్రపరచాలని తెలిపారు, పంటలో ఏదైనా తేడా వస్తే విత్తన యాక్ట్‌ ప్రకారం ఆయా డీలర్స్‌పై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఎట్టి పరిస్థితిలో ఇలాంటి లూజు విత్తనాలు లేదా గుర్తింపులేని కంపెనీలకు సంబంధించిన విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని సూచించారు. సమావేశంలో రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి గీత, మేడ్చల్‌ జిల్లా వ్యవసాయ అధికారి మేరి రేఖ, చేవెళ్ల సహాయ సంచాలకురాలు రమాదేవి, మండల వ్యవసాయ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love