– పూర్నియా అభ్యర్థిపై 41 కేసులు
పాట్నా : బీహార్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న మొత్తం 50 మంది అభ్యర్థుల్లో 24 శాతం (12) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 18 శాతం (9) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదిక తెలిపింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) బుధవారం ఈ నివేదికను విడుదల చేసింది.
పూర్నియా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజేష్ రంజన్ అలియాస్ పప్పుయాదవ్‌పై అత్యధికంగా 41 కేసులు ఉన్నట్టు సర్వే తెలిపింది. పూర్నియా నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీపీఐ(ఎం) నేత అజిత్ సర్కార్ హత్య కేసులో పప్పుయాదవ్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తెలిపింది. 1998 జూన్‌లో పట్టపగలు అజిత్‌సర్కార్‌ను పప్పుయాదవ్ గ్యాంగ్ హత్య చేసింది.
మొత్తం ఐదు స్థానాల్లో పోటీ చేస్తున్న అధికారిక కూటమి పార్టీ జేడీ(యూ) అభ్యర్థుల్లో 40 శాతం మంది క్రిమినల్ కేసులు, 20 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రతిపక్ష కూటమి మహాఘట్బంధన్‌లోని ఆర్‌జెడి రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. అభ్యర్థుల్లో 50 శాతం మంది క్రిమినల్ కేసులు, తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఎఐఎంఐఎం కిషన్ గంజ్ స్థానంలో పోటీ చేస్తుండగా, వందశాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు, తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది.
అభ్యర్థులంతా సంపన్నులే..
అభ్యర్థుల్లో 28 శాతం (14 ) మంది కోటి కన్నా ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నట్లు ప్రకటించారు. భగల్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి అజిత్ శర్మ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. ఆయన ఆస్తుల విలువ రూ.54 కోట్లుగా ప్రకటించారు. కిషన్‌గంజ్, కతిహార్ స్థానాలకు ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థులు మొహమ్మద్ జావేద్, తారిక్ అన్వర్‌ల ఆస్తుల విలువ వరుసగా రూ. 18 కోట్లు, రూ.15 కోట్లుగా ప్రకటించారు. పప్పుయాదవ్ ఆస్తుల విలువ సుమారు రూ.10 కోట్లుగా ఉంది. అభ్యర్థుల్లో ఒకరు మాత్రమే డిప్లొమా హోల్డర్‌గా ప్రకటించారు. 7గురు అభ్యర్థులు కేవలం ‘అక్షరాస్యులు’గా తెలిపారు. 36 శాతం (16) మంది అభ్యర్థులు 12వ తరగతి వరకు చదువుకున్నారు. 26 శాతం (52) మంది గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువగా ప్రకటించారు. 50 మంది అభ్యర్థుల్లో కేవలం (6శాతం) ముగ్గురు మహిళా అభ్యర్థులు ఉండగా, 14 శాతం (7) మంది అభ్యర్థుల వయస్సు 61 పైన ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది.