సచివాలయ అలంకరణను పరిశీలించిన సీఎస్‌

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న డాక్టర్‌ .బి.ఆర్‌. అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనాన్ని రంగు రంగుల విద్యుత్‌ దీపాలు, రకరకాల పూలతో పూర్తిగా ఉత్సవ వాతావరణం కలిగేలా అలంకరించారు.
ఇప్పటికే, తెల్లటి ధవళ కాంతితో వెలిగి పోతున్న సచివాలయ భవనం ఈ సరికొత్త అలంకరణలతో మరింత ఆకర్షణీయంగా మారింది. కాగా, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లను నేడు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పరిశీలించారు. సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ అశోక్‌ రెడ్డి, ప్రోటోకాల్‌ డైరెక్టర్‌ అర్విందర్‌ సింగ్‌ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈనెల 9 నుంచి గొర్రెల పంపిణీ ప్రారంభం : మంత్రి తలసాని
ఈనెల 9 నుంచి గొర్రెల పంపణీ కార్యక్రమాన్ని నకిరేకల్‌ నియోజకవర్గంలో ప్రారంభించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. గొర్రెల పంపిణీ, ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌, దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్షించారు. గొర్రెల అభివృద్ధి పథకం, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాల బ్రోచర్లను స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ ఆధార్‌ సిన్హా తో కలిసి మంత్రి ఆవిష్కరించారు. 8వ తేదీ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఫిష్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. గొర్రెల యూనిట్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Spread the love