నకిలీ పత్తి విత్తనాల పట్టివేత

నకిలీ పత్తి విత్తనాల పట్టివేత– వేర్వేరు చోట్ల ఇద్దరి అరెస్ట్‌
– 310 కిలోల విత్తనాలు, నిషేధిత గడ్డి మందు స్వాధీనం
వ్యవసాయాధికారులు, పోలీసులు ఓవైపు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నా.. మరోవైపు నకిలీ విత్తనాల దందా కొనసాగుతూనే ఉంది. పలుచోట్ల పట్టుబడుతున్నా నిందితులు ఇండ్ల వద్దే రైతులను నమ్మించి అమ్మకాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్‌ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు.. నిషేధిత గడ్డి మందును రైతులకు విక్రయిస్తున్న వారిని పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి వరంగల్‌ పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నవతెలంగాణ- వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
టాస్క్‌ఫోర్స్‌ పోలీసులతోపాటు సంగెం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేసి విత్తనాలతో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో వున్నారు. ఈ రెండు సంఘటనల్లో 310 కిలోల నకిలీ పత్తి విత్తనాలను, రూ.1.10 లక్షల విలువ గల 122 లీటర్ల నిషేధిత గడ్డిమందు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌ జిల్లా సంగెం మండలం గాంధీనగర్‌కు చెందిన కోడూరి శ్రీనివాసరావు, సూర్యాపేట జిల్లా తిర్మలగిరికి చెందిన తనకు వరుసకు మామైన నగామల్లేశ్వర్‌రావుతో కలిసి ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించారు. పరారీలో వున్న గుంటూరు జిల్లా పెద్దకూరపాడుకు చెందిన ఏటుకూరి సుబ్బారావు వద్ద కోడూరి శ్రీనివాసరావు తన మామతో కలిసి పెద్ద మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఈ విత్తనాలు గ్లయోసెట్‌ గడ్డి మందును తట్టుకునే శక్తితోపాటు దిగుబడిని అధికంగా ఇస్తుందని రైతులను నమ్మించి నకిలీ పత్తి విత్తనాలను ఎక్కువ ధరకు విక్రయించారు. శ్రీనివాసరావు తన ఇంటి వద్ద నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తుం డగా పోలీసులకందిన పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌, సంగెం పోలీసులు కలిసి దాడి చేసి పట్టుకున్నారు. విత్తనాలతోపాటు 50 లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు.
మరో ఘటనలో సంగెం మండలం తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన మెంతుల రాజేష్‌ నిషేధిత గడ్డి మందును విక్రయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిందితుడి ఇంట్లో తనిఖీ చేయగా 72 లీటర్ల గడ్డిమందు లభ్యమైంది.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌
నకిలీ విత్తనాలను రైతులకు అంటగడితే వారిపై పీడీ యాక్ట్‌ కింద కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా తెలిపారు. ఎవరైనా నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు తెలిస్తే వెంటనే 8712685070 వాట్సాప్‌ నెంబర్‌కు సమాచారం అందించాలని, ఈ సమాచారం అందచేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
పోలీసులను అభినందించిన కమిషనర్‌
రెండు చోట్ల నకిలీ విత్తన విక్రయాల నిందితులను పట్టుకున్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారి శుభంనాగ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీ జితేందర్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ మధుసూదన్‌, ఇన్‌స్పెక్టర్లు సార్ల రాజు, ఎస్‌.రవికుమార్‌, ఎస్‌ఐలు నిస్సార్‌ పాషా, శరత్‌కుమార్‌, సంగెం ఎస్‌ఐ నరేష్‌, ఎఎఓ సల్మాన్‌ పాషా, మండల వ్యవసాయాధికారి యాకయ్య, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, ఏఎస్‌ఐ ఉప్పలయ్య, కానిస్టేబుళ్లు అశోక్‌, శ్రీనాధ్‌, మాధవరెడ్డి, కానిస్టేబుళ్లు రాజేశ్‌, భిక్షపతి, సురేష్‌, సాంబరాజు, శ్రీనివాస్‌, నాగరాజు తదితర వ్యవసాయాధికారులను పోలీసు కమిషనర్‌ అభినందించారు.

Spread the love