నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు ప్రతి శనివారం నిర్వహించే సాంస్కృతిక దినం కార్యక్రమంలో భాగంగా శనివారం విద్యార్థినుల కోసం మెహందీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి అల్లు అనిత మాట్లాడుతూ.. ఆషాఢ మాసంలో మెహందీ పెట్టుకోవడం భారతీయ సంప్రదాయంలో భాగమే కాక ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనకరమని తెలిపారు. మెహందీ శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు వర్షాకాలంలో తేమ కారణంగా చేతులు, కాళ్ల గోర్ల వద్ద వచ్చే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుందని వివరించారు. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరిచి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కూడా మెహందీ ఉపయోగపడుతుందని విద్యార్థినులకు సూచించారు.
అనంతరం పోటీల్లో విజేతలైన విద్యార్థినులకు ప్రిన్సిపాల్ అల్లు అనిత చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి కే. పావని (ద్వితీయ సంవత్సరం బైపీసీ), రెండో బహుమతి సి.హెచ్. తన్వి (మొదటి సంవత్సరం సీఈసీ), మూడో బహుమతి జి. వెంకట రమ్య (ద్వితీయ సంవత్సరం సీఈసీ), నాలుగో బహుమతి హేమ సంజన (మొదటి సంవత్సరం హెచ్‌ఈసీ) గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ కౌన్సిలర్ శ్రీమతి ఎస్.కె. సహజ, అధ్యాపకులు శిరీష, సృజనతో పాటు కళాశాల విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.



