కూర‌లు పిరం.. ప‌ప్పులు కొన‌లేం

Curries, piram pulses cannot be bought– వినియోగానికి సరిపడా లేని సాగు విస్తీర్ణం…
– పంట దిగుబడులొచ్చే వరకు ధరల మంటలే
– ప్రతి ఏటా ఇదే తంతు.. పట్టించుకోని ప్రభుత్వాలు
– సబ్సిడీ ఎత్తేయడంలో సాగుకు ఆసక్తి చూపని రైతులు
– ఇతర రాష్ట్రాల నుంచి అధిక దిగుమతులు
– మార్కెట్‌ సౌకర్యం కల్పించాలంటున్న అన్నదాతలు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి/మొఫిసిల్‌ యంత్రాగం
‘ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టులేదు. నాగులో నాగన్న… ఈ ధరల మీద ధరలు పెరిగే నాగులో నాగన్న’ అనే పాట పాతదే అయినా వర్తమానానికి వర్తిస్తుంది. సేరు పప్పుకొనబోతే సెటాకంత రాకపాయే… కిలో కాయలు కొందామంటే పావు కిలో రాకపాయే అన్నట్టు ఉంది మార్కెట్‌లో కాయగూరలు, పప్పు ధరల పరిస్థితి. మార్కెట్‌ మాయా జాలంతో పండించే రైతుకు గిట్టుబాటు ధర దక్కట్లేదు. వినియోగదారుల జేబుకు చిల్లులు పడుతున్నాయి. వినియోగానికి సరిపడ పంట రాష్ట్రంలో పండకపోవడం, ఏటా అకాల వర్షాల వల్ల పంట నష్టమేర్పడడంతో కాయకూరల ధరలు మండిపోతున్నాయి. దోసకాయ, దొండ, బెండ, వంకాయ, ఆలుగడ్డ ధరలు పైకి ఎగబకాయి. పచ్చిమిర్చి, క్యాఫ్సికం, బీర, కాకరకాయలైతే పావు కిలోకే సరిపెట్టేస్తున్నారు. కూరగాయలు, పప్పులే కాదు మాంసం, కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఉల్లిని కొనలేని పరిస్థితి ఏర్పడింది. కాయకూరల సాగుకు సరైన ప్రోత్సహకాల్లేకపోవడం, సాగు చేసిన రైతుకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ఏటేటా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. సెప్టెంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు పంటలు పండుతాయి. దీంతో ఆగస్టు వరకు ఇతర రాష్ట్రాల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటిదాకా దళారులు కొరతను సృష్టించి ధరలు పెంచడం మామూలైంది. పంట చేతికందేవరకు ధరలు అందుబాటులోకి రావడం కష్టమేనని తెలుస్తోంది. దీనకంతటికీ ప్రభుత్వాల నిర్లక్ష్యమే. ప్రభుత్వాలు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే కాయగూరల సాగు పెరిగే అవకాశం ఉంది. స్కూల్స్‌ ప్రారంభమైనందున ప్రభుత్వ స్కూల్స్‌లో మధ్యాహ్నభోజనం, హాస్టల్స్‌, రెసిడెన్షియల్స్‌లో భోజనం, టిఫిన్స్‌ విషయంలోనూ కాయగూరలు, పప్పుల ధరల ప్రభావం పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ధరలు పరిస్థితి, కూరగాయల సాగుపై బుధ, గురువారాల్లో నవతెలంగాణ బృందం పరిశీలించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రోత్సాహమేది…?
రాష్ట్రంలో 41.75 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. ప్రస్తుతం 23.46 లక్షల టన్నుల కూరగాయలే మాత్రమే ఉన్నాయి. 18.29 లక్షల టన్నుల కూరగాయల కొరత ఉంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారుల అంచనా. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో భూములకు రేట్లు పెరగడంతో ఎక్కువమంది కూరగాయల సాగుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో పాటు మార్కెటింగ్‌ సౌకర్యం కూడా ప్రభుత్వాలు కల్పించడం లేదు. 2020-21 నుండి రాష్ట్రంలో కూరగాయల సాగులో సబ్సిడీలను ఎత్తివేశారు. విత్తనాలు, డ్రిప్‌, మల్చింగ్‌ పేపర్‌, పందిళ్ళు, ట్రెల్లిస్‌, ప్లాస్టిక్‌ క్రేట్స్‌ 50 శాతం సబ్సిడీ పై ఇచ్చేవారు. గత 4-5 ఏండ్లుగా ప్రభుత్వం ఉద్యాన శాఖ లో సబ్సిడీలను ఇవ్వడం లేదు. దీంతో రైతులు కూరగాయల పంటలు వేసేందుకు సుముఖత చూపడం లేదు. వ్యవసాయ ప్రణాళికలోనూ 70 లక్షల ఎకరాల్లో పత్తి, 60 లక్షల ఎకరాల్లో వరి సాగుకు ప్రభుత్వం అంచనా వేసింది. మిగతా 10 లక్షల ఎకరాల్లోనే కాయగూరలు, నూనెలు, పండ్లతోటలు, ఇతర పంటలు సాగు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వాల ప్రాధాన్యతల్లోనే ఈ పంటల సాగుకు సరైన ప్రోత్సాహం ఇవ్వడం లేదని తెలుస్తోంది.
హైదరాబాద్‌కు ఎక్కువగా తరలింపు…
ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రోజువారీగా ప్రజలు వినియోగించే కాయగూరలకు సరిపడగా సాగు విస్తీర్ణం లేదు. సంగారెడ్డి జిల్లాల్లోని జహీరాబాద్‌, ఝరాసంఘం, న్యాల్‌కల్‌, కోహీర్‌ వంటి ప్రాంతాల్లో 12 వేల ఎకరాల్లో ఆలుగడ్డ, 2 వేల ఎకరాల్లో అల్లం పడిస్తారు. సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్‌ ప్రాంతాల్లో 1500 ఎకరాల్లో ఉల్లిగడ్డ సాగు చేస్తున్నారు. దొండ, బెండ, దోస, చిక్కుడు, పచ్చిమిర్చి పండిస్తున్నప్పటికీ మార్కెట్‌ అవసరాలకు సరిపడ లేదు. దళారులు తోటపైనే సరుకును కొనుగోలు చేసి హైదరాబాద్‌ మార్కెట్‌కు తీసుకెళ్తుండడంతో స్థానికంగా కాయగూరల కొరత వల్ల ధరలు మండుతున్నాయంటున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కంది, పెసర, మినుము సాగు 2.50 లక్షల ఎకరాలపైనే ఉంది. అయితే పంట దిగుబడి చేతికొచ్చాక గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఇతర పంటల వైప్పు మళ్లుతున్నారు. ప్రస్తుతం సాగు చేసిన పంట చేతికొచ్చే వరకు ధరల ప్రభావం ఇలాగే ఉంటుందని వ్యాపారులు పేర్కొన్నారు. గతంలో కాయగూరలు సాగు చేసే రైతులకు డ్రిఫ్‌, విత్తనాల సబ్సిడీ ఉండేది. ముఖ్యంగా కోల్డ్‌ స్టోరేజీల్లేకపోవడం వల్ల కూడా పంట నిల్వ ఉంచుకునే సదుపాయంలేదని రైతులు చెబుతున్నారు.
చిత్తూరు, కర్నూల నుంచి ఖమ్మానికి…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు నాలుగు వేల ఎకరాల్లో కూరగాయ పంటలు సాగవుతున్నాయి. పట్టణాలకు దగ్గరగా ఉన్న గ్రామాల్లోనే ఈ పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. 4000 మంది రైతులు 3400 ఎకరాల్లో కూరగాయ పంటలు సేద్యం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 1780 ఎకరాల్లో 200 మందికి పైగా రైతులు సేద్యం చేస్తుండగా.. కొత్తగూడెం జిల్లాలో 1600 మంది రైతులు సాగు చేస్తున్నారు. టమాటా అత్యధికంగా 500 ఎకరాలకు పైగా సాగవుతుండగా, బెండకాయ కూడా అంతే మొత్తంలో సేద్యం చేస్తున్నారు. దోసకాయ, మునగకాయలను సుమారు 400 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఆకుకూరలు 300 ఎకరాల్లో, కాకరకాయ, వంకాయ మరో 300 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ప్రజల అవసరాలకు సరిపడా సాగు లేకపోవడంతో కర్నూల్‌, చిత్తూరు తదితర ప్రాంతాల నుంచి భారీ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నారు.
ఉమ్మడి రంగారెడ్డిలో రియల్‌ ఎస్టేట్‌ ప్రభావం..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణా మండలాల్లో కూరగాయలు పండిస్తున్నారు. శంషాబాద్‌, శంకర్‌పల్లి, చేవెళ్ల, మహేశ్వరం, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లో కూరగాయాలు సాగు చేసు ్తన్నారు. ఉల్లి 397 ఎకరాలు, అలుగడ్డ 28ఎకరాలు, కొత్తమీర 41ఎకరాలు, అన్ని రకాల కూరగాయాలు మొత్తం 66,222 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వికారాబాద్‌ జిల్లాలో నవాబుపేట, మర్పల్లి, పరిగి, తాండూర్‌, కోట్‌పల్లి, పూడూర్‌ మండలాల్లో కూరగాయాలు సాగు చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వల్ల గతంలో కంటే కూరగాయాల సాగు తగ్గింది. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని దిగుబడి తగ్గింది. దాంతో ధరలు కూడా పెరిగాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో తగ్గుతున్న పంట
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కూరగాయల సాగు క్రమంగా తగ్గుతోంది. 35,200 వేల ఎకరాలకు పైగా కూరగాయలను సాగు చేసేవారు. తాజాగా అధికారిక లెక్కల ప్రకారం 15 వేల ఎకరాల్లో సాగు తగ్గింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో 5 వేల ఎకరాలు, గద్వాలలో 3500 వేల ఎకరాలు, వనపర్తిలో 3500ఎకరాలు, నారాయణ పేటలో 3000 వేల ఎకరాలను సాగు చేస్తున్నారు. జిల్లాకు సరిపడే కూరగాయలు దిగుబడి లేక ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వరంగల్‌కు..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రధానంగా ఖిలా వరంగల్‌, దామెర, గీసుగొండ, సంగెం, ఆత్మకూరు మండలాల్లో కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. మే నెల లోపే ఇక్కడ కూరగాయల రాబడులు బంద్‌ అవుతాయి. మే నెల చివరి వారం నుండే ఇతర రాష్ట్రాల నుండి కూరగాయలు వరంగల్‌ కు అధికంగా వస్తాయి. ప్రస్తుతం టమాటా మదనపల్లి మార్కెట్‌ నుండి రోజూ 240 క్వింటాళ్ల వస్తుంది. పచ్చి మిర్చి మహారాష్ట్ర నుండి రోజూ 350 క్వింటాళ్ల వస్తున్నది. వరంగల్‌ లక్ష్మిపురం మార్కెట్లో కిలో టమాట రూ. 50.00 వుంటే.. రిటైల్గా రూ.80.00 వరకు అమ్ముతున్నారు. మీర్చి కిలో రూ.70.00 నుండి రూ.80.00 ల వరకు అమ్ముతున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో బెండకాయ, తోటకూర, బచ్చలి కూర, చుక్కకూర, సొరకాయ, మినహా ఎలాంటి కూరగాయలు పండడం లేదు. అన్ని రకాల కూరగాయలు ఆంధ్ర నుంచి దిగుమతి అవుతున్నాయి మహబూబాబాద్‌ జిల్లాలో బెండకాయలు రూ.30(కిలో), తోటకూర రూ.10(5కట్టలు), బచ్చల కూర రూ.10 (6 కట్టలు), చుక్కకూర రూ.10(5కట్టలు), మిగిలిన అన్ని కూరగాయలు ఆంధ్ర నుంచి దిగుమతి అవుతున్నాయి. రైతు బజార్‌ లేకపోవడంతో రైతుల కూరగాయలు పండించి తీసుకొని రావడం లేదు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా లో కూరగాయల ధరలు మండుతున్నాయి. హన్మకొండ జిల్లా లో వాన కాలంలో 628 ఎకరాలు, ఎండా కాలంలో 984 ఎకరాలలో కూరగాయలు పండిస్తారు. ఈ రెండు కాలాల్లో ఈ జిల్లాలో రెండు కాలాల్లో మొత్తంగా 1612 ఎకరాల్లో కాయగూరలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వరంగల్‌ జిల్లాలో 3,899 ఎకరాల్లో కాయగూరలు, ఆకుకూరలు పండిస్తున్నారు. వాస్తవానికి కూరగాయల సాగుకు సంబందించి అసలు లెక్కలు అధికారుల వద్ద లేవు. జూన్‌, జూలై, ఆగస్టు వరకు ఈ ధరలు తీవ్రంగా వుండే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ధరలు చుక్కల్లో …
పంటలు లేకపోవడం, దళారుల మాయాజాలంతో మార్కెట్లో కాయగూరలు ధరలు చుక్కలనంటుతున్నాయి. ఆకు కూరలు, కాయగూరల ధరలు మండిపోతుండడంతో వినియోగదారులు విలవిలలాడుతున్నారు. మండుతున్న ధరల పరిస్థితిని పరిశీలిస్తే… సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట జిల్లాల్లో పచ్చిమిర్చి గాటు రకం కిలో రూ.100 ఉండగా సాధారణ రకం రూ.80 అమ్ముతుంది. అల్లంవెల్లుల్లి కిలో ధర రూ.200 పైనే ఉంది. కాకర, బీరకాయ కిలో ధర రూ.80, టమాటా, చామగడ్డ, క్యారెట్‌, దోస, వంకాయ కిలో ధర కూడా రూ.60 నుంచి రూ. 80 పలుకుతుంది. బెండ, దొండ, ఆలుగడ్డ సైతం రూ.50 నుంచి రూ.70 కిలో అమ్ముతున్నారు. పచ్చి మిర్చి కిలో రూ.120, వంకాయ కిలో రూ.100 అయింది. చిన్న సైజు నాలుగు మునగకాయల ధర రూ.50 ఉంది. గోరుచిక్కుడు, చిక్కుడు ధరలు కూడా మండుతున్నాయి. పాలకూర, గొంగూర, మెంతినకూర ధరలు కూడా పెరిగాయి.
పెరిగిన పప్పుల ధరలు
పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం పెరగకపోవడం, వర్షాల వల్ల పంట నష్టపోవడంతో వివిద పప్పుల ధరలు కూడా పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో నాణ్యమైన కంది పప్పు ధర కిలో రూ.185 ఉంది. సాధారణ రకమైతే రూ.175 పలుకుతుంది. పెసర పప్పు ధర కూడా రూ.125, శనపప్పు ధర రూ.92, మినపప్పు ధర రూ.140 వరకు ఉంది.

Spread the love