నదుల అనుసంధానంతో తెలంగాణకు ప్రమాదం

Danger to Telangana with river connectivity– నీటి వాటాలు తేల్చకుండా గోదావరి నీళ్లను తరలించుకుపోయే కుట్ర
– తెలంగాణకు 968 టీఎంసీల నీళ్లపై రాష్ట్రం స్పందించాలే..
– దిష్టిబొమ్మల్లా బీజేపీ ఎంపీలు ఉండొద్దు
– పెండింగ్‌ ప్రాజెక్టుల అనుమతులు ఇచ్చాకనే… ‘ఇచ్చంపల్లి’ ముచ్చట : కరీంనగర్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
దేశంలోని నదుల అనుసంధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టుకు అడుగులు వేసిందని, ఇది ప్రజాప్రయోజనాల దృష్ట్యా బాగానే కనిపిస్తున్నా.. గోదావరినదిపైనే ఆధారపడిన తెలంగాణ జలాలను తరలించుకుపోయే కుట్ర జరుగుతోందని మాజీ ఎంపీ, కరీంనగర్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 365రోజులూ ప్రవహించే గంగా, బ్రహ్మపుత్ర నదులతో జత కట్టి రాష్ట్రంలోని గోదావరి నీటిని ఇచ్చపల్లి ప్రాజెక్టు ద్వారా కిందికి తరలించుకుపోయేందుకు ప్లాన్‌ చేసిందన్నారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే గంగుల నివాసంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నదుల అనుసంధాన ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టంపై వివరించారు. తెలంగాణ ప్రాంతానికి గోదావరి నది ఒక కల్పతరువని, కోటి ఎకరాలకు సాగునీరు, రాష్ట్ర ప్రజలకు, హైదరాబాద్‌లాంటి మహానగరానికి తాగునీరు ఇక్కడి నుంచే పోతాయని తెలిపారు. అలాంటి నదిపై కేంద్రం ఎంఓయూ పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపిందని వివరించారు. వరంగల్‌ జిల్లా పరిధిలోని ఇచ్చంపల్లిలో పెద్ద డ్యాం కట్టి నీళ్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఉత్తర భారతంలోని గంగా నది నుంచి ఒడిషాలోని మహానది మీదుగా రాష్ట్రంలోని గోదావరి నుంచి కృష్ణ… అక్కడి నుంచి కావేరికి నదిని అనుసంధానం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోందన్నారు. అయితే గంగా నది నుంచి మహానది వరకు ఇంతవరకూ సర్వే జరగలేదని, కల్పతరువుగా ఉన్న తెలంగాణ గోదావరి జలాలను దోచుకునే కుట్రకు తెరతీస్తున్నారని అన్నారు. 1966లో ఫిన్‌లాండ్‌ రాజధాని హెల్సింకీ ప్రపంచ జల శిఖరాగ్ర సదస్సులో ఆయా ప్రాంతాల్లో ప్రవహించే నదుల్లోని నీటిని మొట్టమొదట ప్రాజెక్టులు కట్టి ఎవరు వాడుకుంటారో వారికే ఆ నీటిపై సర్వహక్కులు ఉంటాయని ఓ కీలక తీర్మానం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీన్నే ‘రైపేరియర్‌ రైట్స్‌’గా చెప్పారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏడాదిలో 80 రోజులు నిరంతర ప్రవాహం ఉండే గోదావరిపై రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోసే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును బీఆర్‌ఎస్‌ పూర్తి చేసిందన్నారు. అయినా గోదావరిలో వాటా కింద 968 టీఎంసీలు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. రైపేరియర్‌ రైట్స్‌ కింద అదే కాళేశ్వరం నుంచి మరో అదనపు టీఎంసీని కూడా ఎత్తిపోసే విధంగా ప్రాజెక్టు చేపడితే.. దోచుకునేందుకు బీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తుందంటూ ఇక్కడి విపక్షాలు అసంబద్ధ ఆరోపణలు చేశాయని అన్నారు. ఆ అదనపు టీఎంసీ ఎత్తిపోతకు కేంద్రం అనుమతి ఇవ్వకుండానే ఇప్పుడు గోదావరి జలాలను దోచుకునే కుట్రకు తెరతీసిందన్నారు. ఇప్పటికే కర్నాటకలో కృష్ణా నదిపై అడ్డగోలుగా బ్యారేజ్‌లు కట్టడంతో మనకు ఆ నీళ్లు వచ్చే పరిస్థితి లేదని, ఇప్పుడు గుండెకాయలా ఉన్న గోదావరి నీళ్లు పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేశారు. కనీసం నలుగురు బీజేపీ ఎంపీలు అయినా స్పందించాలని, దిష్టిబొమ్మల్లా ఉండకూడదని కోరారు. ఏమాత్రం ఆలస్యం చేసినా ఈ నదుల అనుసంధానంతో కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాలు ఎడారిలా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరువు ముదురుతున్న క్రమంలో కాళేశ్వరం ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. ఇన్నాళ్లూ మేడిగడ్డపై రాజకీయ రాద్ధాంతం చేసి ఇప్పుడు కుంగిన ఫిల్లర్ల వద్ద కాఫర్‌డ్యామ్‌ నిర్మాణానికి ఆలోచిస్తోందని, ఇప్పటికైనా తేరుకోవడం శుభపరిణామమని అన్నారు. ఆయనతోపాటు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణ, మేయర్‌ సునిల్‌రావు సహా పార్టీ శ్రేణులు ఉన్నారు.

Spread the love