ప్రియమైన పుస్తక పాఠకులకు…

Dear Book Readers…నిన్న కాక మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆలోచనలు, ఆ ఆలోచనల పురోగతి గురించి చర్చించుకునే రోజే ఈ మహిళా దినోత్సవం. అలా చర్చించుకోవాలంటే సరైన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని అందించడంలో పుస్తకాలు మొదటి స్థానంలో ఉంటాయి. పుస్తకాలు ఎవరికైనా మంచి నేస్తాలే. ఎన్నో విషయాలు నేర్పుతాయి. మనతో మాట్లాడతాయి. మనకు ఓదార్పునిస్తాయి. కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాయి. అందుకే ముఖ్యంగా మహిళలు కచ్చితంగా పుస్తకాలు చదవాలి. ఈ సందర్భంగా భారతీయ మహిళా రచయిత్రులు కొందరు తమ అపార అనుభవం నుండి ఒక ఆలోచనను వెలికితీసి పుస్తక పాఠకులతో పంచుకుంటున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం…
సహకరించుకోవాలి
పితృస్వామ్య సమాజాన్ని, మూస పద్ధతులను సవాలు చేస్తూ యువతులు సాధికారతను సాధించాలి. లింగ సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్వేచ్ఛగా మాట్లాడాలి. రాజకీయ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు మహిళలు ముందుకు రావాలి. అందులో మీ ప్రత్యేక దృక్పథం, అనుభవాలను ఉపయోగించుకోవాలి. ఇతర అన్ని రంగాలలోని మహిళలతో కలిసి తమ సమస్యలపై గొంతు విప్పాలి. యువతులందరూ కలిసి ఒకరి జీవితాన్ని ఒకరు మెరుగుపరుచుకునేందుకు సహకరించుకోవాలి. అప్పుడే మనల్ని శక్తివంతం చేసే మెరుగైన సమాజాన్ని సృష్టించగలరు.
– హరిత సావిత్రి, జిన్‌ రచయిత

గాఢంగా ప్రేమించుకోండి
మహిళలు అపారమైన శక్తి కలిగిన వారు. ఎన్ని అడ్డుంకులు వచ్చినా శక్తిమంతంగా ఉండగలరు. మనల్ని మనం అంగీకరించినట్లయితే అంటే మనం చేయగలం అనే నమ్మకం మనకు ఉంటే మన కలలు, మన ఆశలను కచ్చితంగా సాధించగలం. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు గాఢంగా ప్రేమించుకోండి. సమాజంతో సంబంధాలు మెరుగుపరుచుకోండి. మీ తెలివితేటలను పూర్తి స్థాయిలో ఉపయోగించి ఓ మంచి స్థాయికి ఎదగండి.
– గీతాంజలి పండిట్‌, బుద్ధ ఇన్‌ లవ్‌ రచయిత

మీకోసం మీరు
ప్రతి విషయానికీ ఇతరులపై ఆధారపడకండి. మీకు సహాయం చేయడానికి, మీ పరిస్థితిని మెరుగుపరచడానికి ఎవరో వస్తారని ఎదురు చూడకండి. మీ అంతట మీరే మంచి స్నేహితులను, నెట్‌వర్క్‌ను సృష్టించండి. నేర్చుకునేందుకు సమాజంలో మంచి అవకాశాలు ఉన్నాయి. కనుక కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా మీకోసం మీరు సమయాన్ని వెచ్చించండి. మీపై విషం చల్లేందుకు ప్రయత్నించే వ్యక్తుల గురించి పట్టించుకోకండి.
– గార్గి రావత్‌, టైగర్‌ సీజన్‌ రచయిత

అదే నిజమైన ప్రేమ
ప్రేమ అనేది సాధారణంగా అధికారంలో ఉన్నవారి ప్రయోజనం కోసం పని చేసే ఒక ఉత్పత్తి సాధనం అని అర్థం చేసుకోవాలని నేను యువతులను కోరుతున్నాను. ఇది అర్థం చేసుకుంటే మహిళలు తమను తాము శాశ్వతంగా రక్షించుకోవచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకునే భాగస్వామిని పొందడం గొప్ప విషయం. ఇంట్లో, సంఘంలో మీరు చేస్తున్న శ్రమలో 50 శాతం భాగం పంచుకుంటే అప్పుడు అతనిది నిజమైన ప్రేమని తెలుసుకోండి.
– ఐషా సర్వరీ, హార్ట్‌ టాంట్రమ్స్‌ రచయిత

మీతో మీరు
సాధారణంగా మీపై ఇతరుల అంచనాలు మీ నిర్ణయాలను, జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అయితే ఆ ప్రయాణంలో మిమ్మల్ని మీరు కోల్పోకండి. మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సంబంధం మీతో మీరు కలిగి ఉన్న సంబంధం. దానికి కూడా మీరు కచ్చితంగా ప్రాధాన్యం ఇవ్వండి. ఒక వేళ ఇప్పటి వరకు మీతో మీకు మంచి సంబంధం లేకపోతే వెంటనే పెంచుకోండి.
– మాలినీ గోయల్‌, అన్‌బాక్సింగ్‌ రచయిత

తీర్చిదిద్దుకోవాలి
యువతులకు నా సలహా ఏమిటంటే వారు రెక్కలు విప్పి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలి. తమను తాము విలువైనవారిగా తీర్చిదిద్దుకోవాలి. వారి సొంత కలలను నెరవేర్చుకోవడానికి కృషి చేయాలి. అప్పుడే సామాజిక నిబంధనలు, ప్రతికూల ప్రభావాలు ప్రకాశవంతంగా ప్రకాశించే వారి సామర్థ్యానికి ఆటంకం కలిగించకుండా ఉండటాయి.
– తబిందా జలీల్‌ బర్నీ, కథా రచయిత

ఇతరులకు అవకాశం ఇవ్వొద్దు
మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి. మీ కలలు అనుసరించండి. వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేయండి. మీరు ఏం చేయాలి, ఎలా కనిపించాలి అనే విషయాలపై ఇతరులకు అవకాశం ఇవ్వొదు. మీరు చేస్తున్నది మంచి అయినప్పుడు సమాజానికి భయపడొద్దు.
– మిచెల్‌ మెండోన్సా బంబావాలే, బికమింగ్‌ గోవాన్‌ రచయిత

Spread the love