”పాపం పుణ్యం ప్రపంచమార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్ధాలు ఏమీ ఎరుగని పూవుల్లారా!” అని పిలిచాడు మహాకవి శ్రీశ్రీ. అలాంటి ఏమీ ఎరుగని పూవుల్లా పూసిన ప్రాణాలు నిర్లక్ష్యపు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు? ఆ పసిపిల్లల తల్లుల కడుపుకోతను తీర్చేదేవరు? గుజరాత్ రాజ్ కోట్ ప్లేజోన్లో, ఢిల్లీ దవాఖానాలో ఎగిసిన అగ్నికీలలు దేశవ్యాప్తంగా మేటవేసిన వ్యవస్థాగత లోపాలను మరోసారి ఎత్తి చూపాయి. కొన్ని గంటల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ రెండు దుర్ఘటనల్లో పసిపిల్లలు సజీవ దహనమయ్యారు.
హృదయాన్ని ఛిద్రం చేసిన ఈ రెండు ఘటనలకు నిర్లక్ష్యం, ఉదాసీనతలే ప్రధాన కారణాలు. ప్రాణాలు పోయాల్సిన దవాఖానాలు, ఆహ్లాదాన్ని పెంచాల్సిన ప్లేజోన్లు ముక్కుపచ్చలారని పసి ప్రాణాలను కబళించే కబేళాలుగా మారిపోతున్నాయి. వరుసగా చోటుచేసుకుం టున్న ఘటనలను చూస్తుంటే ఈ దేశంలో ప్రాణాలకు ఏమాత్రం విలువే లేదన్నది స్పష్టం. అందుకు గుజరాత్ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టుకు తెలిపిన సమాధానమే నిదర్శనం. 33మందిని బలి తీసుకున్న దుర్ఘటనను సుమోటాగా విచారించిన గుజరాత్ హైకోర్టు మున్సిపల్ కార్పొరేషన్, రాష్ట్రప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండి పడింది. తగిన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోలేదం టూ రాష్ట్రప్రభుత్వ న్యాయవాది చెప్పిన నిర్లక్ష్యపు సమాధానంపై న్యాయస్థానం మరింత ఆగ్రహించింది.
‘మీ పరిధిలో అంత నిర్మాణం వెలిస్తే మీరు కళ్లు మూసుకున్నారా? లేక నిద్రపోతున్నారా? గత మూడున్నరేండ్లుగా అక్కడ గేమింగ్ జోన్ నడుస్తుంటే ఆ విషయం మీకు తెలియదా? అగ్నిమాపక అనుమతుల కోసం వారు దరఖాస్తు చేసుకున్నారా? అక్కడికి వెళ్లే వారికి ఇచ్చే టికెట్లపై వినోదం పన్ను (మున్సిపాల్టీకి చెల్లించే పన్ను) వసూలు చేస్తారు. అదైనా మీకు తెలుసా?’ అని ప్రశ్నల వర్షం కురిపించింది. బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలంటూ మరో న్యాయవాది చేసిన వాదనను కొట్టిపారేస్తూ ‘ఎవరు కఠిన చర్యలు చేపడతారు? రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీద మాకు నమ్మకం పోయిం దంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది నాలుగేండ్ల క్రితం మేం ఆదేశాలు జారీ చేశాం. వాటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. తాజా ఘటనతో కలిపి ఆరు అగ్ని ప్రమాదాలు జరిగాయి. ప్రాణాలు పోయిన తరువాతే అధికారులు రంగంలోకి దిగుతున్నారు. దీనినిబట్టి ప్రాణాలు పోవాలని కోరుకుంటున్నట్టున్నారు?’ అంటూ కోర్టు అసహనం వ్యక్తం చేసిందంటే ప్రజల ప్రాణాలు పట్ల ప్రభుత్వాల ఉదాసీనతను ఇది అద్దం పడుతోంది.
అగ్నిమాపక నిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయకుండా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రయివేటు దవాఖానాలు దేశంలో గల్లీగల్లీకి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వాల అలక్ష్యం, అక్రమార్కుల కాసుల కక్కుర్తి, అధికారుల అవినీతి వెరసి మానవతా విలువలను సజీవ సమాధి చేస్తున్నాయి. బూడిద కుప్పగా మారిన 33 మందిని డిఎన్‌ఎ ఆధారంగా వారిని గుర్తించాల్సిన దుస్థితి రావడం అత్యంత దారుణం.
పై రెండు ఘటనల్లోనూ ప్రమాదాలను నివారించడానికి, ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడటానికి అవసరమైన కనీస సదుపాయాలే మృగ్యమయ్యాయి. అగ్నిమాపక పరికరాలు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లే మార్గాలు, సహాయక చర్యలు చేపట్టేందుకు శిక్షణ పొందిన సిబ్బంది లేరు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా వీటిని నడపడానికి అనుమతించిన పాలకుల, అధికారుల బాధ్యతారాహిత్యమే ప్రధాన కారణం. వీటితోపాటు దేశవ్యాప్తంగా అనేక ఘటనలు జరిగాయి. ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాధ్ పాలనలో కోవిడ్ కాలంలో ఆక్సిజన్ అందక 63 మంది బాలలు మరణించిన ఘటన ఆనాడు చర్చనీయాంశమైంది. 2021లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని ఆసుపత్రిలో మంటలు చెలరేగి 10 మంది చిన్నారులు ఆహుతయ్యారు. 2018 నాటి ఫిక్కి-పింకర్టన్ అధ్యయనం ప్రకారం మన దేశంలోని పట్టణ ప్రాంతాల్లో అవసరమైన అగ్నిమాపక కేంద్రాలకంటే 40 శాతం తక్కువగా ఉన్నాయి. దేశంలోని అగ్నిమాపక మౌలిక సదుపాయాలను ఆధునీకరించాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. అయినా అడుగు ముందుకుపడింది లేదు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటికే డ్రగ్స్ సమస్య వేధిస్తుంటే, నిన్నటికి నిన్న చిన్నారుల అక్రమ అమ్మకాలు వెలుగు చూడటం శోచనీయం. అయితే మన రాష్ట్ర యంత్రాం గం ఇలాంటి ఘటనలపై కఠినంగానే వ్యవహరిస్తోంది. చిన్నారుల అక్రమ రవాణా చేసే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేసిన 16 మంది చిన్నారులను రక్షించడం అభినం దనీయం. అయితే ఇదే సరిపోదు. చిన్నారుల, ప్రజల ఉసురు తీసే రాజకీయ వత్తిళ్లను అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించ కూడదు. నిబంధనలు కఠినంగా అమలు జరిగేలా న్యాయ వ్యవస్థ కొరడా ఝుళిపించడంతో పాటు ప్రజల అప్రమత్తత కూడా అవసరం.