హామీలు ఎగ్గొట్టేందుకే అప్పుల బూచి

హామీలు ఎగ్గొట్టేందుకే అప్పుల బూచి– బీఆర్‌ఎస్‌ ఓడినందుకు జనం బాధపడుతున్నారు
– నెల రోజుల్లోనే కాంగ్రెస్‌పై భారీ వ్యతిరేకత
–  సిట్టింగులను మారిస్తే ఫలితం మరోలా ఉండేది
–  పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మావే
–  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అలవి గాని హామీలిచ్చి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్‌ పార్టీ, వాటిని వదిలించుకునేందుకు అప్పుల బూచిని చూపించి పబ్బం గడుపుకుంటోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఆపార్టీకి ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్‌ సీఎం కానందుకు బాధ పడుతున్నారనీ, ఇప్పటికి ఆయనపై ఉన్న అభిమానం చెక్కుచెదరలేదని అన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుందనీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలను అప్పడే ప్రజా క్షేత్రంలో నిలదీస్తున్నారని గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ అనివార్యమనీ, అన్నింటా బీఆర్‌ఎస్‌కే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందనీ, పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వబోమని తేల్చిచెప్పారు. సంస్థాగతంగా పార్టీ బలంగా లేనప్పుడు 2014 లో ఒంటరిగా పోటీ చేస్తే ప్రజలు దీవించారనీ, తాజా ఎన్నికల్లో 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని అన్నారు. దళిత బంధు పార్టీకి తీవ్రంగా నష్టం చేసిందనీ, ఒక వర్గానికి ఇస్తే మరో వర్గం ఓట్లు వేయలేదని చెప్పారు. పార్టీ అన్నపుడు ఎత్తు, పల్లాలు తప్పవని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 420 హామీలను ప్రజల్లోకి విస్తతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచాలని కార్యకర్తలకు సూచించారు. జిల్లాల సంఖ్య తగ్గిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్‌ తప్పు పట్టారు. మాజీ మంత్రి టి.హరీష్‌ రావు మాట్లాడుతూ విభజన సమస్యలు ఇంకా పెండింగ్‌ లోనే ఉన్నాయనీ, రాష్ట్రానికి న్యాయం చేయడం కాంగ్రెస్‌ బీజేపీల వల్ల కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణకు బీజేపీ మొండి చెయ్యి చూపిస్తే, కాంగ్రెస్‌ తొండి చూపిస్తుందని విమర్శించారు. మన హక్కులు మనం ఢిల్లీలో సాధించుకోవాలంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన బీఆర్‌ఎస్‌ పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు.బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నపుడు కేంద్రతో సఖ్యతగా లేమని సీఎం అనడాన్ని తప్పుపట్టారు. పీసీసీ అధ్యక్షులుగా ఉన్నపుడు కేంద్రంలో ఎవరిని కలిసినా  బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కయ్యాయని ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. దేశంలోనే వినూత్నంగా కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పార్టీ పేదల పొట్టగొట్టొద్దని హితవు చెప్పారు. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో సంఖ్యాపరంగా కాంగ్రెస్‌ గెలిచినా, నైతికంగా బీఆర్‌ఎస్‌ గెలిచిందని గుర్తు చేశారు. గ్రూపు తగాదాలకు స్వస్తి పలికి పార్టీ విజయానికి పాటుపడాలని కార్యకర్తలకు ఉద్బోదించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరంలో చేయాల్సిన పనులను కేసీఆర్‌ ప్రభుత్వం ఒక నెలలో చేసిందని అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ గెలుపు చారిత్రక అవసరమనీ, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Spread the love