ధోనీపై ఢిల్లీలో పరువు నష్టం కేసు..

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌: భారత మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీపై ఢిల్లీలో పరువు నష్టం కేసు నమోదైంది. క్రికెట్‌ అకాడమీ విషయంలో మాజీ వ్యాపార భాగస్వాములు  తనను రూ.15 కోట్ల మేర మోసం చేశారంటూ ధోనీ.. ఇటీవలే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్కా స్పోర్ట్స్‌ య‌జ‌మాని మిహిర్ దివాక‌ర్‌, సౌమ్యా విశ్వాస్ ‌ తాజాగా ధోనీపై పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఒప్పంద ఉల్లంఘన జరిగిందంటూ ధోనీ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ పరువుకు భంగం కలిగించేలా ప్రకటనలు చేశారని ఆరోపించారు. ఈ మేరకు తమకు నష్ట పరిహారం చెల్లించాలని పిటిషనర్లు కోరారు. అదేవిధంగా సోషల్ మీడియా, మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో తమకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా నియంత్రించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ కేసుపై జనవరి 18న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా, మిహిర్, సౌమ్యాలు క్రికెట్ అకాడ‌మీ పెడ‌తామ‌ని 2017లో ధోనీతో ఒప్పందం చేసుకున్నారు. ఫ్రాంచైజ్ ఫీ, లాభాల్లో వాటా ఇస్తామ‌ని అగ్రిమెంట్‌లో రాసుకున్నారు. కానీ, నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కుతూ తనను మోసం చేశారంటూ మ‌హీ భాయ్‌ ఇటీవలే రాంచీ కోర్టును ఆశ్రయించారు. క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని ఒప్పందాన్ని కుదుర్చుకొని దానిని పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద రాంచీ కోర్టులో కేసు నమోదయింది.

Spread the love