రిటైర్మెంట్‌పై ధోనీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు…



నవతెలంగాణ – అహ్మాదాబాద్‌:
ఐపీఎల్ కెరీర్‌కు స్వ‌స్తి ప‌లికేందుకు ధోనీ సిద్ధంగా ఉన్న‌ట్లు ఇటీవ‌ల కొన్ని సంకేతాలు అందిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభంలోనూ ఓ మ్యాచ్‌లో ధోనీ ఫిట్‌నెస్ స‌మ‌స్య‌తో ఇబ్బందిప‌డ్డాడు. అయితే ఇక ధోనీ రిటైర్ అవుతాడ‌ని ఊహాగానాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో.. ఈ యేటి ఐపీఎల్ టైటిల్‌ను చెన్నై జ‌ట్టు సొంతం చేసుకున్న‌ది. ఐపీఎల్ ట్రోఫీని అయిదోసారి గెలిచిన త‌ర్వాత ధోనీ మీడియాతో మాట్లాడారు. ఆ స‌మ‌యంలో రిటైర్మెంట్‌పై అడిగిన ప్ర‌శ్న‌కు ధోనీ బ‌దులిచ్చాడు. తానేమీ ఇప్పుడే రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం లేద‌ని ధోనీ తెలిపాడు. 41 ఏళ్ల ధోనీ రాబోయే తొమ్మిది నెల‌లు త‌న ఫిట్‌నెస్‌పై ఫోక‌స్ పెట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించాడు. వీలైనంత వ‌ర‌కు వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌లో ఆడేందుకు ప్ర‌య‌త్నించ‌నున్న‌ట్లు తెలిపాడు. త‌న అభిమానుల‌కు త‌న ఆట‌ను గిఫ్ట్‌గా ఇవ్వాల‌నుకుంటున్న‌ట్లు చెప్పాడు. ఈ ఏడాది నేను ఎక్కడకు వెళ్లినా ప్రేక్షకుల నుంచి భారీగా ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నా. ఇలాంటప్పుడు అందరికీ థాంక్స్‌ అని చెప్పడం చాలా సులువు. అయితే, నాకు కష్టమైన విషయం ఏంటంటే.. మరో 9 నెలలు శ్రమించి కనీసం వచ్చే సీజన్‌ అయినా ఆడాలి. ఇదంతా నా శరీరంపై ఆధారపడి ఉంటుంది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఆరేడు నెలల సమయం ఉంది. టైటిల్‌ను మా జట్టు నాకు గిఫ్ట్‌ ఇచ్చింది. నాపట్ల వారు చూపిన ప్రేమాభిమానాలకు.. నేను చేయాల్సిన బాధ్యతలు ఇంకా ఉన్నాయనిపిస్తోంది. నా కెరీర్‌కు చివరి దశ కావడంతో కాస్త భావోద్వేగానికి గురయ్యా. తొలి మ్యాచ్‌ కోసం బరిలోకి దిగినప్పుడు అభిమానులు నా పేరును పలుకుతుంటే ఎమోషనల్‌గా మారా. డగౌట్‌లో ఉన్న నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడే అనుకున్నా ఈ సీజన్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఆడాలని. అలాగే చెన్నై జట్టు పరిస్థితి కూడా ఇదే. తిరిగి వచ్చి మళ్లీ ఆడేందుకు చేయగలిగినదంతా చేస్తా. నన్ను, నా గేమ్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులకు రుణపడి ఉంటా. ఇదే సమయంలో నా వ్యక్తిత్వం ఎప్పటికీ మార్చుకోను. ప్రతి ట్రోఫీ ప్రత్యేకమే. అయితే, ప్రతి మ్యాచ్‌లోనూ ఉత్కంఠ ఉండటమే ఐపీఎల్‌ స్పెషల్. దాని కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు.

Spread the love