ఐపీఎల్‌ ఫైనల్‌లో గుజరాత్‌తో చెన్నై అమీతుమీ

నవతెలంగాణ – అహ్మదాబాద్‌: సమఉజ్జీల సమరానికి రంగం సిద్ధమైంది. దాదాపు రెండు నెలల పాటు అభిమానులను అలరించిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌ ఫైనల్‌ ఆదివారం జరుగనుంది. లీగ్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు తెచ్చుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒక వైపు.. నిరుడు సంచలన ప్రదర్శనతో టైటిల్‌ పట్టిన డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మరోవైపు సమరానికి సై అంటున్నాయి. గడ్డిపోచలను సైతం గడ్డపారలుగా మలచగల ధోనీ ఐదో సారి ఐపీఎల్‌ ట్రోఫీ అందుకొని లీగ్‌కు గుడ్‌బై చెప్తాడా.. లేక హార్దిక్‌ పాండ్యా వరుసగా రెండో సారి కప్పును ముద్దాడుతాడా అనేది ఆసక్తికరం. ఈ రెండు జట్ల మధ్య చెన్నై వేదికగా జరిగిన క్వాలిఫయర్‌-1లో ధోనీ సేన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని గుజరాత్‌ భావిస్తుంటే.. అదే మ్యాజిక్‌ కొనసాగించాలని చెన్నై కృతనిశ్చయంతో ఉంది. ఇరు జట్ల మధ్య ప్రధాన వ్యత్యాసం యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అనక తప్పని పరిస్థితి. ఈ సీజన్‌లో కాలరుద్రుడిలా చెలరేగిపోతున్న ఈ చిచ్చర పిడుగు గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలతో అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. చెన్నై విజయం సాధించాలంటే ముందు గిల్‌ కోసం ప్రత్యేక వ్యూహాలు రచించాల్సిందే. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌తోనే ప్రారంభమైన 16వ సీజన్‌ చివరకు ఈ రెండు జట్ల మధ్య పోరుతోనే ముగియనుండటం కొసమెరుపు.

Spread the love