– కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయండి :పార్టీ శ్రేణులకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశ వ్యాప్తంగా లౌకిక, ప్రజాతంత్ర, ప్రగతిశీల శక్తులతో కలిసి పని చేయాలని సీపీఐ జాతీయ సమితి ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను ఓడిరచడమే లక్ష్యంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టు కున్నామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో విజయసారధి అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సీపీఐ నాయకులు, శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కమిటీకి సమన్వయకర్తలుగా పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్, ఈటి నర్సింహాలు వ్యవహరిస్తారని వివరించారు. కొత్తగూడెంలో తమ పార్టీ అభ్యర్థి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ మద్దతు కోరిన కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల
ప్రజాయుద్ధనౌక గద్దర్ కుమార్తె, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల శనివారం మఖ్దూంభవన్‌కు వచ్చి తన గెలుపు కోసం సహకరించాలని సీపీఐ నాయకులను కోరారు.
కాంగ్రెస్, సీపీఐ పొత్తు కొనసాగిస్తున్న సందర్భంలో సీపీఐ జాతీయ కార్యదర్శులు నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డిలను కలిసి మద్దతు కోరారు. దీనికి వారు స్పందిస్తూ వెన్నెల గెలుపు కోసం సీపీఐ నాయకులు, శ్రేణులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.