ఆ వీడియోను తొలగించండి.. సునీతా కేజ్రీవాల్‌ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

నవతెలంగాణ – న్యూఢిల్లీ : ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ భార్య సునీత కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 28వ తేదీన అరవింద్‌ కేజ్రీవాల్‌ కోర్టులో మాట్లాడుతున్న దృశ్యాలను తన సోషల్‌ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఆ వీడియో ఎక్కడున్నా తీసివేయాలంటూ ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా వేదికలకు ఆదేశాలనిచ్చింది. తదుపరి విచారణ జూలై 9 న ఉంటుందని చెప్పింది. మార్చి 28న కేజ్రీవాల్‌ ట్రయల్‌ కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడు కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌.. కోర్టు ప్రొసిడింగ్స్‌ వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీనిని మరికొందరు రీ పోస్ట్‌ చేశారు. దీనిపై న్యాయవాది వైభవ్‌ సింగ్‌ ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ వేశారు. కోర్టు రూల్స్‌ ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ ను విచారించిన జస్టిస్‌ నీనా బన్సల్‌ కృష్ణ, అమిత్‌ శర్మలతో కూడిన ధర్మాసనం కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంఘించనట్లు అవుతుందని కోర్టు తప్పుబట్టింది. సునీతా కేజ్రీవాల్‌ తో పాటు మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసింది. ఇలాంటి కంటెంట్‌ మళ్లీ పోస్ట్‌ చేసినట్లు తమ దృష్టికి తీసుకువస్తే వాటిని తొలగించాలని సోషల్‌ మీడియా మధ్యవర్తులను కూడా హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 9 కి వాయిదా వేసింది.

Spread the love