‘బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం చచ్చింది’

– సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి.నరసింహ
నవతెలంగాణ – హిమాయత్ నగర్
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యం నెమ్మదిగా చచ్చిందని, నిరంకుశత్వం వేగంగా ప్రాణం పోసుకుందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి.నరసింహ ఆరోపించారు.”నియంతృత్వ” నిర్ణయాలు, చరిత్రను వక్రీకరించడం, రాజ్యాంగాన్ని ద్వంసం చేయడం, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడం, మత భావాలను రెచ్చగొట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం తప్ప బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి చేసింది ఏమి లేదని దుయ్యబట్టారు.పెరుగుతున్న నిరుద్యోగం, ఇంధన, నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టడంలో, అధిక ద్రవ్యోల్బణం కట్టడిలో, రైతుల ఆదాయాన్ని రెట్టింపులో, నల్లధనం వెనక్కి తీసుకురావడంలో మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆయన విమర్శించారు.మంగళవారం హిమాయత్ నగర్, సత్యనారాయణరెడ్డి భవన్ లో సిపిఐ హైదరాబాద్ జిల్లా సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో “సిపిఐ ప్రజా గర్జన” వాల్ పోస్టర్ ను ఈ.టి.నరసింహ ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..దేశాన్ని అభివృద్ధి చేయకుండా ఉన్న దేశ సంపదను హోల్ సేల్ గా మోడీ ప్రభుత్వం అమ్ముకుంటుందని, ఈ ప్రభుత్వంలో ప్రజలు అభివృద్ధి చెందలేదని కేవలం మోడీ మిత్రులు అంబానీ, అదానీలు అభివృద్ధి చెందారని ధ్వజమెత్తారు.బీజేపీ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలు, సంక్షేమ పథకాలు ఎత్తివేయడం, కోతలు విధించడం, అధిక వస్తు సేవల పన్ను వసూలు వల్ల ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలనలో అరాచకాలు, అణిచివేతలు, దాడులు, అశాంతి వాతావరణం వంటి భయానక దృశ్యలు ప్రజలు చూస్తున్నారన్నారు.జన్ సంపర్క్ అభియాన్ పేరట మోడీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను బీజేపీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తే ఇప్పటికే మోసపోయామని భావిస్తున్న ప్రజలు తరమితరమికొడుతారన్నారు.ప్రధాని మోడీ నిరంకుశ ప్రభుత్వాన్ని ప్రజలు నేరుగా తిరస్కరించిన కర్ణాటక ఎన్నికలే ఇందుకు నిదర్శనమని, దక్షిణాది నుంచి మొదలైన ఈ అసంతృప్తి దేశాన్ని మొత్తం చుట్టు ముడుతుందని, దేశ ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు ఎదురు చూస్తున్నారని హెచ్చరించారు.అనంతరం సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయాదేవి మాట్లాడుతూ..బీజేపీ కేంద్ర ప్రభుత్వ తిరోగమన విధానాలు, బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కొత్తగూడం పట్టణంలో జూన్ 4వ తేదీన ‘సిపిఐ ప్రజా గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.లక్ష మందితో జరిగే ఈ బహిరంగ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డిలు హాజరవుతారని ఆమె తెలిపారు.పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున హాజరై ‘సిపిఐ ప్రజా గర్జన’ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి.వెంకటేశం, బి.స్టాలిన్, జిల్లా కార్యవర్గ సభ్యులు జి.చంద్రమోహన్ గౌడ్, పడాల నళిని, షంషుద్దీన్, ఏం.వెంకట్ స్వామి, నెర్లకంటి శ్రీకాంత్, కంపల్లి శ్రీనివాస్, ఎండి.సలీం, తదితరులు పాల్గొన్నారు.

Spread the love