సమగ్ర శిక్ష మండలస్థాయి అకౌంటెంట్లను విధుల్లోకి తీసుకొండి

Comprehensive Punishment Mandal Level
Hire accountants– సీఎం కేసీఆర్‌కు జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సమగ్ర శిక్ష మండల స్థాయి అకౌంటెంట్లను విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు ఆయన సోమవారం లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో 1,537 మంది మండలస్థాయి అకౌంటెంట్లను నియమించారని గుర్తు చేశారు. రెండేండ్లు వారు విధులు నిర్వహించారని తెలిపారు. అనంతరం వారిని విధుల నుంచి తొలగించిన కారణంగా హైకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. వారిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించిందని వివరించారు. రాష్ట్ర విభజనకు ముందు ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌, నేటి మంత్రులు వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణకు 603 మంది, ఏపీకి 934 మంది కేటాయించబడ్డారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్ర ఉత్తర్వుల ప్రకారం కోర్టు ఆదేశించిన విధంగా ఏపీలో 934 మందిని విధుల్లోకి తీసుకున్నారని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో తొమ్మిదేండ్లు అవుతున్నా ఇచ్చిన హామీ అమలు కావడం లేదని తెలిపారు. పలుదఫాలుగా మంత్రులు, అధికారులకు దరఖాస్తు చేసినా విధుల్లోకి తీసుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా స్పందించి కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా వారిని విధుల్లోకి తీసుకోవాలనీ, వారికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love