కాంగ్రెస్‌తోనే అన్ని రంగాల్లో అభివృద్ధి

– మాజీ జెడ్పీ జిల్లా ఫ్లోర్‌ లీడర్‌ ఏనుగు జంగారెడ్డి
– రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-కందుకూరు
కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందనీ మాజీ జెడ్పీ జిల్లా ఫ్లోర్‌ లీడర్‌ ఏనుగు జంగారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీపై, మంత్రి కేటీఆర్‌ అనుచిత వ్యాఖ్యలపై మంగళవారం నిరసన చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ కందుకూరు మండలాధ్యక్షులు సభావాత్‌ కృష్ణనాయక్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల నుంచి తిండి గింజలను దిగుమతి చేసుకుంటే తప్ప తిండికి దిక్కులేని స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకెళ్లిందన్నారు. అన్న పూర్ణగా, అక్షయపాత్రగా, ప్రపంచానికే అన్నం పెట్టే రెండో అతి పెద్ద దేశంగా మలిచింది కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు. ఆఫ్రికా వంటి ఆకలి దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తూ ప్రపంచ పటంలో భారత జాతి కీర్తిని నిలబెట్టింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. దేశానికి స్వాతత్య్రం వచ్చినప్పుడు ఐదున్నర కోట్ల ఎకరాలు సాగయ్యేదనీ, 30 కోట్ల ఎకరాల్లో వ్యవసాయాన్ని విస్తరించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతోందన్నారు. నాగార్జున సాగర్‌, శ్రీశైలం దాకా ఆధునిక ఆలయాలుగా పిలవబడే ఎన్నో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి, కోట్ల మంది ప్రజలకు వ్యవసాయం ద్వారా ఉపాధి అందించినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్షా బ్యాంకు బ్రాంచిలను తెరచి రైతుల పంట పండించిందని ఘనత కాంగ్రెస్‌దేనని వెల్లడించారు. రైతులకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసినట్టు చెప్పారు. దేశంలో విద్యుత్‌ కొరవడిన సమయంలో కూడా చాలినంత ఉచిత విద్యుత్‌ సరఫరా చేసినట్టు వివరించారు. వేల సంఖ్యలో మార్కెట్‌ యార్డులను ప్రారంభించినట్టు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చిగురింత నరసింహారెడ్డి , రాష్ట ప్రచార కమిటీ సభ్యులు సరికొండ మల్లేష్‌, మండల యూత్‌ అధ్యక్షులు దంతోజు నరసింహ చారి, మండల మైనార్టీ చైర్మన్‌ సయ్యద్‌ అజీజ్‌, ఎస్టీ సెల్‌ నాయకులు సభ వత్‌ గణేష్‌, నాయక్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు నరసింహ, మండల యూత్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కత్తుల వెంకటేష్‌, చౌడపు వెంకటేష్‌గౌడ్‌, జిల్లా జనరల్‌ సెక్రెటరీ అఫ్జల్‌ బేగ్‌, డైరెక్టర్‌ తీగల జగదీశ్వర్‌ రెడ్డి, ఉపసర్పంచ్‌ గణేష్‌ కురుమ, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ జగదీశ్‌ కురుమ, సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Spread the love