ధరణి జీవన్మరణ సమస్య

– దివాళా తీసిన కంపెనీకి ధరణి బాధ్యత ఎలా అప్పగిస్తారు?
– విదేశీ కంపెనీ చేతుల్లోకి తెలంగాణ డేటా
– ధరణి లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరగాలి
– కేసీఆర్‌ను అసెంబ్లీలో చెట్టుకు ఉరి తీసినా తప్పులేదు: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ ప్రజలకు ధరణి పోర్టల్‌ జీవన్మరణ సమస్యగా మారిందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని పునరుద్ఘాటిం చారు. దివాళా తీసిన కంపెనీకి ధరణి పోర్టల్‌ బాధ్యతను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. విదేశీ కంపెనీలకు అప్పగించడం ద్వారా తెలంగాణకు సంబంధించిన సమాచారం విదే శీయుల్లో చేతుల్లోకి పోయిందని చెప్పారు. ధరణి పోర్టల్‌ లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరగాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీలో చెట్టుకు ఉరి తీసినా, గల్ఫ్‌ దేశాల్లో మాదిరిగా రాళ్లతో కొట్టినా తప్పు లేదని చెప్పారు. ఇలాంటి మాటలు అనటానికి తాము ఏ మాత్రం భయపడటం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలు మల్లు రవి, హర్కర వేణుగోపాల్‌తో కలిసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. 75 ఏండ్లలో ఏ రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు కేసీఆర్‌ మాదిరిగా దోపిడీకి పాల్పడలేదన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరూ సైబర్‌ నేరగాళ్ల మాదిరిగా ధరణి పేరుతో తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ వెనకాల దొరలు, రాజులున్నారని చెప్పారు. కేసీఆర్‌ దోపిడీ, దొంగతనానికి అడ్డు అదుపూ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి దోపిడీపై తొవ్వుతుంటే కొత్త కొత్త విషయాలు బయపడుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన రెవెన్యూ రికార్డులను ధరణి పేరుతో పూర్తిగా ప్రయివేటు కంపెనీ ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు కట్టబెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో భూలావాదేవీలన్నీ ధరణి పోర్టల్‌ ద్వారా ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ నిర్వహిస్తున్నదని తెలిపారు. వాస్తవానికి ఆ కంపెనీ దివాళా తీసిందన్నారు. గతంలో రూ.90వేల కోట్ల అప్పులు చేసి బ్యాంకులను నిండా ముంచిందని విమర్శించారు. దివాళా తీసిన కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొదటి తప్పు అని చెప్పారు. ఆ కంపెనీ ధరణి నిర్వహణ కోసం సబ్సిడీ కంపెనీ టెర్రాసిస్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిందనీ, అందులో 52.26 శాతం వాటాను టెర్రాసిస్‌ కంపెనీ ఫిలిప్పీన్స్‌ దేశానికి చెందిన ఫాల్కన్‌ కంపెనీకి రూ.1275 కోట్లకు అమ్ముకుందని అన్నారు. కొనుగోలు చేసే కంటే ఒక నెల ముందు మాత్రమే ఫాల్కన్‌ కంపెనీని 2021, అక్టోబర్‌లో ప్రారంభించారని తెలిపారు. ఇప్పుడు టెర్రాసిస్‌ కంపెనీ 99 శాతం వాటా ఫాల్కన్‌ కంపీనికి ఇచ్చేసిందనీ, ఇప్పుడు ఆ కంపెనీలో శ్రీధర్‌రాజు చేరారని తెలిపారు. దాంతో ధరణి పోర్టల్‌ పూర్తిగా శ్రీధర్‌ రాజు చేతుల్లోకి వెళ్ళిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా ప్రజల భూముల వివరాలన్నీ ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారని విమర్శించారు. ధరణి నిర్వహణపై ఐఎల్‌ఎఫ్‌ సంస్థతో రూ.150కోట్లకు ఒప్పందం చేసుకున్నారని గుర్తు చేశారు. ఆ సంస్థకు చెందిన 99శాతం వాటాను టెరాలసిస్‌ టెక్నాలజీస్‌ అనే సంస్థ కొనుగోలు చేసిందనీ, 70లక్షల భూ యజమానుల వివరాలను ఐఎల్‌ఎఫ్‌ సంస్థకు విక్రయించారని ఆరోపించారు. ఒడిశా ప్రభుత్వం 2008లో ఈ-ధరణి పేరుతో ఈ ప్రాజెక్టు ప్రారంభించిందనీ, దీని నిర్వహణను కూడా ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌కు అప్పగించిందన్నారు. ధరణి పోర్టల్‌ పారదర్శకంగా ఉంటే, అంతా తప్పుల తడకగా ఉందంటూ కాగ్‌ రిపోర్టు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. ధరణిని బంగాళాఖాతంలో పడేయాలని కాగ్‌ చెప్పిందని గుర్తు చేశారు. ఇంత జరిగితే కేసీఆర్‌ తానే అద్భుతాలు చేసి ధరణిని సష్ఠించినట్టు చెప్పారని ఎద్దేవా చేశారు. రిజిస్ట్రేషన్‌ కు స్లాట్‌ బుక్‌ చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోతే తిరిగి డబ్బులు రావడం లేదనీ, అందుకు మక్తల్‌కు చెందిన ఆంజనేయులు గౌడ్‌ ఒక ఉదాహరణ అని తెలిపారు. ఇలా ఎన్ని వందల కోట్లు కంపెనీ ఖాతాలోకి వెళుతున్నాయని ప్రశ్నించారు. అసలు ఆ డబ్బులు ప్రభుత్వానికి చేరుతున్నాయా? చెప్పాలన్నారు.
ధరణి ద్వారా జరిగిన లావాదేవీలతో వచ్చిన రూ.50వేల కోట్లలో రూ. 40వేల కోట్లు ప్రభుత్వానికి వెళ్లాయని కొంత మంది అధికారులు చెబుతున్నారనీ, ఇది వాస్తవమా? అవాస్తవమా? విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లక్షల కోట్ల దోపిడీ జరుగుతున్నా కేంద్రం కేసీఆర్‌పై ఎందుకు విచారణకు అదేశించడం లేదని ప్రశ్నించారు. దీని వెనక ఏ గూడుపుఠానీ ఉందో కేంద్ర బీజేపీ నేతలే చెప్పాలని డిమాండ్‌చేశారు. ‘అరవింద్‌ కుమార్‌ లీగల్‌ నోటీసులను రిజిస్టర్‌ పోస్టు లేదా పర్సన్‌ ద్వారా నాకు పంపాలి.. కానీ పబ్లిక్‌ డొమైన్‌లో ఎలా పబ్లిష్‌ చేస్తారు. మీడియాకు ఎలా రిలీజ్‌ చేస్తారు? ఉద్దేశపూర్వకంగానే అరవింద్‌ కుమార్‌ నా ప్రతిష్ఠను తగ్గించేలా వ్యవహరించారని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నేతలు
నోముల, శ్రీహరిరావు, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సికింద్రాబాద్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు నోముల ప్రకాష్‌ గౌడ్‌, నిర్మల్‌ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ నేత శ్రీహరి రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రకాష్‌ గౌడ్‌ సేవలను ఉపయోగించుకుని వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. గ్రేటర్‌లో సెల్ఫీలు దిగే వారు, సెల్ఫ్‌ డబ్బాలు కొట్టుకునేవారు ఎక్కువయ్యారు అని బీఆర్‌ఎస్‌ నాయకులను ఎద్దేవా చేశారు. కేటీఆర్‌, దానం నాగేందర్‌ ను సూటిగా ప్రశ్నిస్తున్నా.. గ్రేటర్‌ లో మెట్రో నిర్మించింది కాంగ్రెస్‌ కాదా? అని ప్రశ్నించారు. కచ్చితంగా నిర్మల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగరేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్‌లో గెలవడం ఎంత ముఖ్యమో నిర్మల్‌ నియోజకవర్గంలో గెలవడం అంతే ప్రాధాన్యతగా తీసుకుంటామన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ కుటుంబానికి, ప్రజలకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీని బండకేసి కొడతారని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
సిగ్గనిపించడం లేదా కేసీఆర్‌? రేవంత్‌ ట్వీట్‌
రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) బాధిత రైతులకు బేడీలు వేసి భువనగిరి కోర్టుకు తీసుకొచ్చిన ఘటనపై రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘ఆడబిడ్డలపై అకృత్యాలు చేసే దుర్మార్గులపై చర్యలు ఉండవు. మత్తు పదార్థాల మాఫియాకు శిక్షలు ఉండవు. భూ కబ్జాలు చేసే బీఆర్‌ఎస్‌ గద్దలపై కేసులు ఉండవు. తన రక్తాన్ని చెమటగా మార్చి బుక్కెడు బువ్వ పెట్టే రైతు చేతికి సంకెళ్లా? సిగ్గనిపించడం లేదా కేసీఆర్‌’. అని రేవంత్‌ ప్రశ్నించారు.
కాంగ్రెస్‌లో పొంగులేటి చేరిక ఖాయం :మాజీ ఎంపీ వి హనుమంతరావు
మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో పార్టీలో చేరుతారని మాజీ ఎంపీ వి హనుమంతరావు వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండా చేరుతున్నారని తెలిపారు. అన్ని సీట్లు పొంగులేటి వర్గానికి అనేది అవాస్తవమని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ చూసుకుంటారని వివరించారు.

Spread the love