– కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి నందిత ఇంటి ముందు
– ఇండ్లు ఇస్తామని రూ. 1.46 కోట్లు వసూలు చేశారని ఆందోళన
– తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్
నవతెలంగాణ-కంటోన్మెంట్
డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఇప్పిస్తామని మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబం తమను మోసం చేసిందని పలువురు బాధితులు శనివారం బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి లాస్య నందిత ఇంటి ముందు ధర్నా చేశారు. ‘మాకు న్యాయం చేయాలి… మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి’ అంటూ బాధితులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన చేసిన వారిలో బీఆర్‌ఎస్ నాయకులు ఉండడం చర్చనీయాంశమవుతోంది. ధర్నా సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ.. సుమారు 30 మందికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామని ఎమ్మెల్యేగా సాయన్న ఉన్నప్పుడు ఒక్కొక్కరి వద్ద నుంచి సుమారు రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. అలా రూ. కోటీ 46 లక్షలు వసూలు చేశారని తెలిపారు. లాస్య నందిత, నివేదిత, ఆర్డీవో వసంత్, ఎమ్మార్వో సమక్షంలోనే డబ్బులు ఇచ్చినట్టు చెప్పారు. అయితే నాలుగేండ్లయినా ఇప్పటికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వక పోగా, డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
డబ్బులు అడిగితే ఇప్పుడు ఇస్తాము.. అప్పుడు ఇస్తాము.. అంటూ సాయన్న బిడ్డలు తప్పించుకుంటూ వచ్చారని అన్నారు. సమస్య తీర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ప్రస్తుతం కొంతమందే నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని..తర్వాత చేయబోయే ఆందోళనలో భారీ సంఖ్యలో పాల్గొంటారని వారు హెచ్చరించారు. ఈ విషయాన్ని మాజీ సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకుపోతామన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం నివేదితపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని నివేదితను ఎన్నికల ప్రచారంలో తిరగనియ్యబోమని..ఆమె ఎక్కడ ప్రచారం చేసినా అక్కడకు వెళ్లి అడ్డుకుంటామని హెచ్చరించారు. అప్పులు చేసి బంగారం కుదవ పెట్టి వడ్డీలకు తెచ్చి డబ్బులు ఇచ్చినట్టు బాధితులు చెప్పారు. అటు ఇల్లు రాక ఇటు డబ్బులు తిరిగిరాక తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
ఈ నిరసనలోబీఆర్‌ఎస్ నాయకులు సదానందగౌడ, తేజ్పాల్, రమేష్, రాజేష్‌గౌడ్, అజరు, పరశురామ్ యాదవ్, వాటియా రమేష్, బాబా, లావణ్య, మీనాకుమారి, హేమలత, నాగమణి, బగ్గారెడ్డి, సురేష్ బాబు, నరేందర్, వంగ నరేందర్, మహమ్మద్ అమిత్ తదితరులు పాల్గొన్నారు.నిరసన కార్యక్రమం జరిగేటప్పుడు ఇంట్లో నివేదిత లేదని సమాచారం.