మాయమవుతున్న ప్రభుత్వ భూములు

– కనుమరుగవుతున్న గుట్టలు
– వెంచర్లకు తరలిస్తున్న ఎర్రమట్టి
– యథేచ్ఛగా అక్రమ మట్టి దందా
– ప్రభుత్వ అదాయానికి గండి
నవతెలంగాణ -పెద్దవూర
మండలం లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో మట్టి దందా విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపడుతున్నారు.పెద్దవూర మండలం పర్వేదుల రెవిన్యుపరిధిలోని కోమటికుంట తండా స్మశానవాటిక పక్కన సర్వేనంబర్ 222 లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఉన్న రాళ్లు మట్టిగుట్టలను ఎలాంటి అనుమతులు లేకుండా యదేచ్చగా ఎర్రమట్టి టిప్పర్లతో పెద్దవూర మండలకేంద్రం, అనుముల మండలం హాలియా లోని వెంచర్లకు అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి పగలు అధికారులు కనుచూపుల్లోనే జరుగుతున్న ఒక్కరంటే ఒక్కరుకూడా అధికారి పట్టించు కోక పోవడం ఏంటని మండల ప్రజలు చర్చించు కుంటున్నారు. కళ్ళ ముందు నుంచే మట్టి తవ్వి రవాణా జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో  మట్టి వ్యాపారుల మట్టి అక్రమ దందా మూడు పూలు అరుకాయలుగా కాసుల వర్షం కురిపిస్తుంది.కోమటి కుంట తండా, బాసోని బావి తండా గ్రామాల మధ్యలో ఉన్న మట్టిని రాత్రి, పగలు వేళలో టిప్పర్ల తో పెద్దవూర వెంచర్లకు తరలిస్తున్నారు. అనుముల మండలం హాలియకు చెందిన కొందరు అక్కడిఎలక్ట్రానికి మీడియా సహకారం తో, టిప్పర్ల తో లక్షలాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో మట్టిని బయట ప్రాంతాలకు తరలిస్తున్నారని సమాచారం.అంతే గాక కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియా కు సంబందించిన టిప్పర్లు కూడా మట్టిని తరలిస్తుండడం తో ఎలక్ట్రానిక్ మీడియనా లేక మట్టి మాఫియానా అని మండలంలోచర్చ జరుగుతుంది
– ప్రభుత్వ అదాయానికి గండి : మండలంలోని పలు గ్రామాల్లో మట్టిని అక్రమంగా తరలించుకుపోతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో గానీ, ప్రైవేట్‌ భూముల నుంచి మట్టిని తరలించాలంటే తప్పనిసరిగా గనులు, భూగర్భ శాఖ, రెవెన్యూ శాఖల నుంచి అనుమతులు పొందాలి. ఒక క్యూబిక్‌ మీటర్‌ మట్టికి 49 రూపాయల చొప్పున సీనరేజీ పన్ను చెల్లించాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టిని తరలించుకుపోతున్నారు. రాత్రివేళల్లో ఈ దందా ఎక్కువగా జరుగుతున్నది. జేబీసీలతో మట్టిని తోడి టిప్పర్లలో లోడింగ్‌ చేసి విక్రయించుకుంటున్నారు.
– ఎర్రమట్టికి పెరిగిన డిమాండ్‌: ఇటీవల భూముల ధరలకు రెక్కలు రావడంతో చాలామంది రైతులు తమ వ్యవసాయ భూములను రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగాలు, వివిధ వ్యాపారులు చేసి కూడబెట్టుకున్న సొమ్మును చాలా మంది భూములపై పెట్టుబడులు పెడుతున్నారు. ఏనాటికైనా భూముల విలువలు పెరుగుతాయి తప్ప తగ్గవనే భావన నెలకొన్నది. దీంతో భూములను కొనుగోలు చేస్తున్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో భూములను చదును చేసి అంతర్గత రోడ్లను నిర్మిస్తున్నారు. ఈ రోడ్ల కోసం ఎర్రమట్టిని ఉపయోగిస్తున్నారు. అలాగే భవనాల నిర్మాణాల కోసం పిల్లర్లు నిర్మించిన తర్వాత బరంతి నింపేందుకు మట్టిని వాడుతున్నారు. సాగర్ నియోజకవర్గం లో ఎక్కువగా ఎర్రటి నేలలు ఉండడంతో మట్టి మాఫీయా ఎర్రమట్టి పై
అక్రమార్కులు కన్నేశారు. గత 05రోజుల నుంచి వేల క్యూబిక్‌ మీటర్ల మట్టిని అక్రమంగా తరలించుకుపోవడం గమనార్హం.
– యాదేచ్చగా సాగుతున్న అక్రమ దందా: నియోజకవర్గం లో అక్రమ మట్టి దందా యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అధికారులకు ఫిర్యాదులు అందుతున్నా సంబంధిత అధికారులు పెద్దగా స్పందించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ అధికారులు సాహసించి వాహనాలను పట్టుకుంటే అధికార పార్టీ నాయకుల నుంచి వెంటనే ఫోన్లు వస్తున్నాయి. వాహనాలను విడిచి పెట్టకుంటే బదిలీల పేరిట అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు ఇతరులు కూడా మట్టి అక్రమంగా దందా చేస్తున్నారు. ఒక టిప్పర్‌ మట్టిని విక్రయించడం ద్వారా 4 వేల నుంచి 6 వేల రూపాయల వరకు ఆర్జిస్తున్నారు. రాత్రి వేళల్లో టిప్పర్లను రోడ్లపై టిపర్లు తిప్పడం వల్ల ప్రమాదాలు
జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దవూర మండలం కోమటికుంట తండా లోఉన్న ప్రభుత్వ భూమిలో ఉన్న గుట్టులనుంచి నిరంతరంగా మట్టినితోడకపోతున్నారని భాసోనిబావి తండా, కోమటి కుంట తండా గిరిజనులు చెబుతున్నారు.ఎక్కడి కక్కడే రెవెన్యూ,  గనులు, భూగర్భ శాఖాధికారులకు మామూళ్లు ముట్టజెబుతూ దందాను కొనసాగిస్తున్నారనే ఆరోపణలు కూడ ఉన్నాయి.నియోజకవర్గం లో చాలా ప్రాంతాల్లో మట్టి అక్రమ దందా కొనసాగుతున్నదని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ మట్టి దందాను నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు.
Spread the love