విశిష్టి చిత్ర‌కారుడు ఉల్చి

Distinguished Painter Ulchiలోకంలో సమస్త జీవరాశి నుండి మనిషిని వేరు చేసే ఒకే ఒక అంశం జ్ఞానం అయితే ఆ జ్ఞానవంతులైన మనుషుల్లో కూడా కొందరిని మరింత ప్రత్యేకంగా నిలబెట్టే అంశం కళ. అది దశ్య, శ్రవ్య లేదా రెండింటి మిశ్రమ కళ ఏదైనా కావచ్చు. వీటినే లలిత కళలని మనం పేర్కొంటాం. లలిత కళల్లో విని ఆనందించేది శ్రవ్య కళ, చూసి ఆనందించేది దశ్య కళ, వినడం, చదవడం ద్వారా ఉభయ కళల అనుభూతిని కలిగించే విశిష్ట మయిన మరో కళ సాహిత్య కళ. సంగీతం, సాహిత్యం, చిత్రకళ మూడింట్లో మరింత ప్రత్యేకమైనది చిత్రకళ.
కారణం శ్రవ్య కళా రూపమైన సంగీతాన్ని ఆస్వాదించాలంటే సమయం వెచ్చించాలి. సాహిత్యాన్ని అస్వాదించాలన్నా సమయం పెట్టాల్సిందే. కానీ దశ్య కళారూపమైన చిత్ర శిల్ప కళలను ఆస్వాదించడానికి సమయం అవసరంలేదు. కేవలం ఒక్క చూపుతోనే మనసుకు దివ్యమైన అనుభూతిని చెందేలా చేస్తుంది చిత్రకళ. అలాంటి విశిష్టమైన చిత్రకళలో వాష్‌ టెక్నిక్‌ ద్వారా అజరామమైన అద్భుత కళా సంపదను సష్టించి తాను జన్మించిన ఊరు పేరును చరిత్రపుటల్లో నిలిచిపోయేలా చేసిన ఒక గొప్ప విశిష్ట చిత్రకారుడు ఉల్చి..
జన్మ భూమిపైన మమకారంతో తాను పుట్టిన ఊరునే తన కుంచె పేరుగా మార్చుకున్న ఈ చిత్రకారుడి అసలు పేరు రెడ్డిబోయిన కష్ణమూర్తి, వీరు ప్రధానంగా చిత్రకారులు, శిల్పి. ఇంతేగాక మరుగుజ్జు మొక్కలను పెంచడం ఆయన మరో హాబీ. వారి ఇంటిని దర్శించిన వారికి పై మూడు రంగాలలో వారు ఒక ఋషిలా జరిపిన కషి మనకు అగుపిస్తుంది. వ్యవసాయ కళాశాల చిత్రకారుడిగా కేవలం కళాశాలకు కావాల్సిన చిత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా చిత్రకారుడిగా తనలోని ఆలోచనలకు నిరంతరం చిత్రరూపం కల్పిస్తూ చిత్రకళలో తనదైన ప్రత్యేక శైలిని ఏర్పరుచుకుని ఆ కళాశాలనందలి ఎందరో చిత్రకళాభిలాషులను ప్రభావితం చేసారు. అలాంటివారిలో నేడు వాష్‌ టెక్నిక్‌లో మరోప్రసిద్ధ చిత్రకారుడిగా పేరు గడించిన మా మిత్రులు మంచెం సుబ్రమన్యేశ్వరరావు గారు ఒకరు.
డ్రాయింగ్‌ టీచర్‌గా పని చేస్తున్న వారిలో చాలామంది స్కూల్‌, కాలేజ్‌ పిల్లలకు కుక్క, నక్క, బాతు, హంస, నెమలి లాంటి చిన్న చిన్న బొమ్మలను నేర్పిస్తూ నెలనెలా వచ్చే జీతం తీసుకుంటూ జీవితాన్ని సాదాసీదాగా గడిపేస్తారు. ఒక ప్రత్యేక తపనతో కృషి చేస్తూ తనదైన సొంత శైలిని ఏర్పరుచుకునే ప్రయత్నం చేయరు. నూటికి తొంబై శాతం ఇలానే వుంటారు. కాని వారందరికి పూర్తి భిన్నంగా, తనదైన రీతిలో అపారమైన కషి చేసి అనంతమైన కళాసంపాదనను మనకు అందించిన ఒక గొప్పకళా ఋషి ఉల్చి గారు.
దాదాపు పన్నెండేళ్ళ క్రితంనాటిమాట. అనగా 2011లో అనుకుంటాను… నేను ’64కళలు.కాం’ అనే అంతర్జాల పత్రికలో ఆర్టికల్‌ రాసేక్రమంలో మిత్రులు మంచెం , బీర శ్రీనివాస్‌, రాజారాంబాబులతో కలిసి చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అనుకున్నాం… మా గ్రూపులో ఒకరైన మంచెం గారి గురువు ఉల్చి గారిని కలుసుకోవాలని. కాని ఇంతవరకు మాకు సాధ్యపడలేదు. పన్నెండేళ్ల తర్వాత అనగా 10-02-2024 నాడు ఆనాటి మా కల నెరవేరింది. ఆ రోజు మరో ప్రముఖ చిత్రకారులు రోహిణికుమార్‌, ఆర్ట్‌ క్యూరేటర్‌ అన్నపూర్ణ, ఉల్చి గారి చిత్రాలను డాక్యుమెంట్‌ చేసే నిమిత్తం వస్తున్నారు… మనం వెళదామా అని చెప్పిన మంచెం గారి పిలుపు మేరకు రెండవ శనివారం కావడంతో సరే అని చెప్పి ఖమ్మం నుండి నేను, బీర శ్రీనివాస్‌; కాకినాడ నుండి మంచెం దంపతులు, విజయవాడ నుండి మరోచిత్రకార మిత్రుడు డ్రీం.రమేష్‌ బయలుదేరి చీరాలలో అందరం కలుసుకుని ఆ ఉదయం వెళ్ళాం. ఉల్చి గారి శ్రీమతి రాజేశ్వరి గారు, వారి ఇరువురు కుమార్తెలు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు.
మేం వెళ్ళిన కాసేపటికి హైదరాబాదు నుండి చిత్రకారుడు రోహిణికుమార్‌, వారి కుమార్తె ఆర్ట్‌ క్యూరేటర్‌ అన్నపూర్న, వారి భర్త ముగ్గురూ కూడా వచ్చిన తర్వాత అందరి తేనీటి సేవనం అనంతరం ఆ యింటి మొదటి అంతస్తులో వున్న ఉల్చిగారి ఆర్ట్‌ గేలరీకి తీసుకు వెళ్లారు శ్రీమతి ఉల్చి రాజేశ్వరి గారు.
గేలరీలోకి అడుగు పెట్టిన తర్వాత తెలిసింది… నేను అంతవరకూ ఊహించుకున్న ఆలోచనకు వాస్తవానికి మధ్య హస్తిమసికాంతరమైన వ్యతాసముందని. కారణం ఇదివరలో మంచెం నాకు చూపించిన ఒక ఆరేడు చిత్రాలు తప్ప ఎక్కువగా ఉల్చి గారి చిత్రాలను చూసి ఉండలేదు. అలాంటిది ఒక పెద్ద ప్రదర్శనశాలనిండా నిండిపోయిన అద్భుతమైన చిత్ర, శిల్ప కళాసంపదను ఒక్కసారిగా చూసినపుడు నిజంగా మనసు ఆనందంతో, ఆశ్చర్యంతో నిండిపోయింది. ఒక పరిపూర్ణమైన కళాకారుడి కుంచె సష్టించిన ఆరోగ్యకరం ఆనందకరం, ఆహ్లాదకరమైన కళాసంపద మా అందరి మనసాలను మరోలోకానికి తీసుకెళ్లేలా చేసాయని చెప్పడంలో యేమాత్రం సందేహం లేదు..
ఉల్చి గారి చిత్రాలలో నూటికి తొంబై శాతం జలవర్ణాలతో వాష్‌ టెక్నిక్‌లో వేసినవే. తైలవర్ణ మాధ్యమంలో వేసినవి కొద్ది సంఖ్యలో వున్నాయి. ఇవిగాకా ఎనామిల్‌ రంగులతో ఆయన ప్రయోగాత్మకంగా చేసిన చిత్రాలు మరికొన్ని. అంతేగాకుండా మట్టి, సిమెంట్‌, రాయి, దారువు తదితర మాధ్యమాలతో ఆయన చెక్కిన శిల్పాలే గాకుండా వర్ణలేపనం చేయకుండా మిగిలిపోయిన సంపూర్ణమైన కొన్ని రేఖా చిత్రాలు చిన్న, మధ్యమ, అతి పెద్ద సైజులోని చిత్రాలు మొత్తం కలిసి దాదాపు నూటయాభై వరకు ఉన్నాయి. ఆయన ప్రతీ చిత్రానికి ఒక సంఖ్యను కేటాయించి ఒక కేటలాగ్‌ను కూడా తయారు చేసుకోవడం నిజంగా ముందుచూపని చెప్పవచ్చు. గాలరీని దర్శించిన వాళ్లకి ఆ కేటలాగ్‌తో చిత్రాలను చూసినపుడు ప్రేక్షకుడు మరింత అవగాహన పొందుతాడు.
చిత్రాలలో అధిక భాగం బుద్దుని జీవిత కథకు సంబంధించిన చిత్రాలున్నాయి. బుద్ధుడి జననం నుండి నిర్యాణం వరకు దాదాపు ముప్పై వరకు జీవితచరిత్రను తెలిపే చిత్రాలు వేసారు. అందులో అధిక భాగం వాష్‌ టెక్నిక్‌లో వేసిన బహుళ వర్ణచిత్రాలే. ఏక వర్ణంలో వేసిన చిత్రాలు, రేఖా చిత్రాలు కూడా కొన్ని వున్నాయి. చిత్రకళలో వాష్‌టెక్నిక్‌ని ఒక ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఒకనాడు దామెర్ల, వరదా వెంకట రత్నం, అడవి బాపిరాజు, రాజాజీ, కొండపల్లి శేషగిరిరావు లాంటి కొద్దిమంది మాత్రమే ఈ విధానంలో కొంత చిత్రరచన చేశారు. ఈ విదానంలో క్వాలిటీ డ్రాయింగ్‌ షీట్‌పై చిత్రకారుడు తనకు కావాల్సిన చిత్రాన్ని రేఖామాత్రంగా గీసుకున్న తర్వాత, ఆ డ్రాయింగ్‌ షీట్‌ని నీటిలో ముంచి, ఆపై ఆ చిత్రంలోని వివిధ భాగాల్లో ప్రధానంగా వ్యక్తం చేయదలచిన భావానికి ఊతంగా నిలిచే వర్ణాలను కుంచెతో అద్దుతారు. ఆపై ఆ చిత్రాన్ని నీటిలో వాష్‌ చేసి మరలా తనకు కావాల్సిన వర్ణాలను అద్ది, మరొక్కసారి నీటిలో వాష్‌ చేస్తారు. ఆ తర్వాత మరలా రంగులద్ది ఇలా పదేపదే రంగులద్ది వాష్‌ చేయడంద్వారా చిత్రంలో చివరిగా పూసిన వర్ణాలతో బాటు ఇంతకు ముందు పలుమార్లు పూసి కడిగిన వర్గాల తాలూకు చాయలు కూడా పారదర్శకంగా కనిపించడంతో చిత్రంలోని వర్ణాలు కుంచెతో కృతకంగా అద్దినట్టుకాకుండా సహజంగా వుండి సాధారణ పధ్ధతి లో వేసిన చిత్రాలకు భిన్నంగా ఒక ప్రత్యేకమైన శోభను సంతరించుకుంటాయి. అందుకే గేలరీలో వున్న చిత్రాలను ఆయన వేసి యాభై అరవై ఏళ్ళు దాటినా ఇంకా ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తూ కనిపించాయి.
రంగులతో ఇంకా ఆయన Automic brush ways, cosmic spectrum water antics,Water graphics లాంటి పేర్లతో రకరకాల ప్రయోగాలు చేసి, కొన్ని నైరూప చిత్రాలను కూడా సష్టించారు. ఈ చిత్రాలకు తైల వర్ణాలను, అందులో ప్రధానంగా ఎనామిల్‌ రంగులు ఉపయోగించి వేసారు. ఒక నీటి తొట్టిలో వివిధ ఎనామిల్‌ వర్ణాలను ఒక క్రమపద్ధతిలో వెదజల్లిన పిదప ఆ నీటిలో మిళితం కాకుండా తేలియాడిన ఆ ఎనామిల్‌ రంగులపైన డ్రాయింగ్‌ షీట్‌ని ఆనించి తీసిన ప్రింట్స్‌ ఇవి. ఇవి కూడా చిత్రకారుడు కుంచెతో అద్దిన వర్ణాల్లా కాకుండా సహజంగా ప్రకతిలో ఏర్పడ్డ వర్ణాల్లా ప్రత్యేకతను కలిగి ఉండడం విశేషం. ఇకపోతే ప్రకతిలో దొరికిన వివిధ చెట్ల కొమ్మలు, వేర్లబాగాలను సైతం సేకరించి, వాటిలో దాగున్న కళారూపాలను వెలికి తీసి తయారుచేసిన శిల్పాలు, సిమెంట్‌, రాయితో చెక్కిన శిల్పాలు ఎన్నో ఆయన కళాతృష్ణకు తార్కాణంగా వారి గేలరీలో నిలిచివున్నాయి.
ఒక చిత్రకారుడిగా ఎంతటి సమున్నత కషి చేసారో శిల్ప కారుడిగా కూడా అంతగానే కషి చేసారని చెప్పడానికి వారు ఉద్యోగ జీవితం గడిపిన బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో ఆయన 36 అడుగుల ఎత్తులో చెక్కిన వ్యవసాయ విజ్ఞాన జ్యోతి అన్న శిల్పాన్ని గాని, గుంటూరు వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన రైతు విగ్రహం గాని నైరూప్యశైలిలో చెక్కిన సరస్వతి దేవి శిల్పం గాని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా వీరి దారు శిల్పాలు డేన్సర్‌, విరహం, న్యూడ్‌ లేడీ తదితరమైనవాటితో బాటు సిమెంట్‌, కాంక్రీట్‌తో చెక్కిన శిల్పాలు శిల్పకారుడిగా వీరి ప్రతిభను చాటుతాయి.
పూర్వ ప్రకాశం జిల్లా నందలి ‘ఉల్పి’ అనే గ్రామంలో 1940లో జన్మించిన కష్ణమూర్తికి బాల్యం నుండే ఏర్పడిన చిత్రకళాభిలాషకి తన తండ్రి, సోదరుల ప్రోత్సాహం తోడయ్యింది. అందుచేతనే హైస్కూల్‌ చదువు అనంతరం మద్రాస్‌ ప్రభుత్వం నుండి పెయింటింగ్‌లో డిప్లొమో చేసి ఫస్ట్‌ క్లాసులో పాసయ్యారు. తదుపరి ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమి అందించిన స్కాలర్‌ షిప్‌తో ప్రఖ్యాత చిత్రకారులు కొండపల్లి శేషగిరిరావు గారి వద్ద వాష్‌ టెక్నిక్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. 1964 నుండి 2000 వరకు బాపట్ల వ్యవసాయ కళాశాలో చిత్రకారుడిగా ఉద్యోగ భాద్యతలు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగిగా కేవలం కళాశాల విద్యార్ధులకు కావాల్సిన చిత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా చిత్రకారుడిగా తనలోని ఆలోచనలకు నిరంతరం తనదైన రీతిలో చిత్రరూపం కల్పిస్తూ చిత్రకళలో ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు.
వాష్‌ టెక్నిక్‌లో ప్రత్యేకతను సంతరించుకున్న వీరి చిత్రాలు దేశంలోని అనేక మ్యూజియాల్లో, విశ్వవిద్యాలయాల్లో, గేలరీల్లో కొలువుదీరాయి. సామూహికంగానే గాక, వ్యక్తిగతంగా కూడా తన చిత్రాలతో 51 ప్రదర్శనలు చేయడం గొప్ప విశేషం. స్వదేశంతో పాటు విదేశాలైన అమెరికా, కెనడా, జర్మని, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలలో సైతం వీరి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. వీరి కళాప్రతిభకు తార్కాణంగా రమ్య శిల్పి, శిల్పకళా విరించి, విశ్వకళా కౌముది, కళా ప్రపూర్ణలాంటి పలు బిరుదులతో అనేక కళాసంస్థలు వీరిని సత్కరించాయి.
ప్రకతి, సమాజం పట్ల స్పందించే హదయం వున్న వాళ్ళు కవులుగానో, కళాకారులుగానే మారతారు. ఉల్చిగారు ఒక చిత్రకారుడు, శిల్పకారుడు గానే గాకా కవిగా కూడా తన భావాలను వ్యక్తీకరించారు. అవి అనేక కవితల రూపంలో పలు దిన, వార, మాసపత్రికలలో ప్రచురితమవడమే గాక 2000వ సంవత్సరంలో వాటన్నింటిని ‘రాతి పోత్తిల్లు’ పేరుతో ఒక కవితా సంకలనాన్ని కూడా తీసుకొచ్చారు. ప్రకృతినందలి ప్రతి దాంట్లో సౌందర్యాన్ని వీక్షించే వీరి కళాజీవితంలో మరోకోణం బోన్సారు మొక్కల సేకరణ, పెంపకం. చీరాలలో వారి చిత్ర ప్రదర్శనశాలను దర్శించడానికి వచ్చినవారిని ఆ ఇంటి ఆవరణలో వారు పెంచిన మరుగుజ్జు మొక్కలు రండి రండి అని ఆహ్వానిస్తాయి. ఆయన ప్రత్యేకంగా సేకరించి పెంచిన ఆ మరుగుజ్జు వక్షాలను చూసి నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.
చిత్రాలు వేయడం ఒక ఎత్తైతే వాటిని పదిలంగా భద్రపరిచి భావి తరాలకు అందిచడం మరో ఎత్తు. ఈ జ్ఞానాన్ని ముందుగా ఎరిగిన వారు గనుకనే తన కాలంలోనే తన ఇంటి పై అంతస్తులో చక్కటి గేలరీని ఏర్పరుచుకుని, తన చిత్రాలు భావి తరాలకు అందేలా చేసారు. దాదాపు అర్ధ శతాబ్దం పాటు చిత్ర, శిల్ప కళలలో విశేషంగా కషి చేసి అజరామమైన కళాసంపదను సష్టించి అలసిపోయిన ఉల్చి తన 68వ ఏట అనగా 2008 ఆగస్టు 26 వ తేదీన శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. నేడు ఆయన లేరు కాని అజరామమైన వారి కళాసంపద మిగిలి వుంది. తన ఇరువురు కుమార్తెలకు వివాహాలు కావడంతో ఏడు పదుల వయసులో వున్న వారి శ్రీమతి రాజేశ్వరిగారు ఏకాంతంగా తన భర్త కళాసంపదను కాపాడుకుంటూ ఉల్చి గారి గురించి తెలుసుకుని గేలరీకి వచ్చిన మాలాంటి చిత్రకళాభిలాషులకు తన భర్త సష్టించిన కళా సంపదను గర్వంగా చూపిస్తున్నా, ఆమెలో ఏదో ఒకింత నిర్వేదన గమనించాం. ఏడు పదుల వయసు మీద బడుతున్న కారణంగా తన తర్వాత ఈ కళాసంపద పరిస్థితి ఏమిటని ఆమె మదిలో రేగే ప్రశ్న ఆ మౌనానికి కారణం కావచ్చు. అందుకే తను చూస్తుండగానే ఉల్చి గారి పేరు శాశ్వతంగా నిలిపే భాద్యత ప్రభుత్వం గాని, సహదయులైన కళాభిలాషులు గాని… భావితరాలకు తెలిపే వెలకట్ట లేని ఆ విలువైన కళాసంపదను సొంతం చేసుకుంటే బావున్ను అనే ఆలోచనలో ఆమె ఉన్నారు. సహేతుకమైన వారి ఆలోచన ఆశయం నెరవేరాలని కోరుకుందాం.
– వెంటపల్లి సత్యనారాయణ, 9491378313

Spread the love