పాఠశాలలో ఈనెల 20న నులిపురుగుల నివారణకు మాత్రల పంపిణీ

నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
దుబ్బాక మండలంలోని ప్రతి పాఠశాలలో ఈనెల 20న విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నట్లు, దీనికి పాఠశాల, ఆశ, అంగన్వాడి సిబ్బంది సహకరించాలని ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నులిపురుగుల నివారణ, మాత్రల పంపిణీకి సంబంధించి తిమ్మాపూర్, రామక్కపేట పిహెచ్ సిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన పిల్లల సమాజం కోసం నులి పురుగులను నిర్మూలించాలని కోరారు. ప్రతి పాఠశాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పరిశుభ్రమైన తాగే నీరును విద్యార్థులకు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులలో నులిపురుగుల వల్ల పోషకాహార లోపం, రక్తహీనతతో తరచుగా అలసిపోతూ శారీరక, మానసిక అభివృద్ధిలో వెనుకబడతారన్నారు. అందుకే ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఆల్బెండజోల్ మాత్రలను వేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో భాస్కర శర్మ, తహసిల్దార్ సలీం మియా, ఎంఈఓ ప్రభుదాస్, ఐసిడిఎస్ సిడిపిఓ చంద్రకళ, రామక్కపేట పి హెచ్ సి వైద్యాధికారి హిమబిందు, నోడల్ ఆఫీసర్ తిరుపతి, వైద్య సిబ్బంది దయాకర్, రవీందర్, భాస్కర్, అంగన్వాడి, ఆశ సిబ్బంది, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love