– కార్మికుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వాల లక్ష్యం
– మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు
నవతెలంగాణ – అశ్వారావుపేట
కేంద్ర ప్రభుత్వ పధకం “నమస్తే” లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ పిలుపు మేరకు అశ్వారావుపేట పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం పారిశుధ్య కార్మికులు, ఇంటింటికీ చెత్త సేకరణ చేసే కార్మికులకు వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ టి. దిలీప్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా పారిశుధ్య కార్మికులు, చెత్త సేకరణ చేసే ప్రైవేట్ కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విధి నిర్వహణలో కార్మికులు తప్పనిసరిగా రక్షణ చర్యలు పాటించాలని సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పీపీఈ కిట్లు కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే వారి కుటుంబాలు, సమాజం ఆరోగ్యంగా ఉంటాయని అన్నారు. గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని, వారి కృషి వల్లే ప్రజారోగ్యం మెరుగుపడుతుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు దండాబత్తుల ఆదిలక్ష్మి, కట్టా సింధుజ, షేక్ రెహానా, కొట్టే నాగసునీత, షేక్ నూర్జహాన్, మిండా హరిబాబు, జీనుగు రవీంద్ర, చిన్నంశెట్టి శ్రీను, తిరుమలశెట్టి వెంకన్నబాబు, కో-ఆప్షన్ సభ్యురాలు తగరం నిర్మల, పమ్మిడి లక్ష్మణ్ రావు, పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


