వర్షాలు, వరదలతో నష్టం జరగొద్దు

వర్షాలు, వరదలతో నష్టం జరగొద్దు– సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి
– నివాసయోగ్యం కాని నిర్మాణాలను తొలగిస్తాం
– బీసీ సంక్షేమం, రవాణా శాఖ, హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌
– అధికారులతో సమీక్షా సమావేశం
నవతెంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లో వర్షాకాలంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమం, రవాణాశాఖ, హైదరాబాద్‌ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆయా శాఖల ఉన్నతాధికారులకు సూచించారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సమావేశం మందిరంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండు గంటలకుపైగా కొనసాగిన సమీక్షా సమావేశంలో మాన్‌సూన్‌ ప్రిపరేషన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను అధికారులు మంత్రికి వివరించారు. పారిశుధ్యం, నాలాల్లో పూడికలు, నీటి నిల్వలపై చర్చ జరిగింది. జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, విద్యుత్‌ శాఖలోని వివిధ విభాగాల పనితీరును సమీక్షించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పలు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. నగరంలో శానిటేషన్‌ సమస్య ఉందని, దాన్ని అధిగమించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. చికెన్‌, మటన్‌ వేస్టేజ్‌ ద్వారా ఆదాయం పెరిగేలా త్వరలో సమీక్ష చేస్తామన్నారు. పురాతన భవనాలకు సంబంధించిన వాటిని గుర్తించామని, నివాసయోగ్యం కాని వాటిని తొలిగిస్తామని చెప్పారు. వర్షాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. రాబోయే వన మహౌత్సవంలో హైదరాబాద్‌ను గ్రీన్‌ సిటీగా ఉంచాలన్నారు. వాటర్‌ లాకింగ్‌ పాయింట్స్‌ గుర్తించి వర్షం పడిన వెంటనే అక్కడకు సిబ్బంది వెళ్లి నీరు నిల్వ ఉండకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోతోందని, శానిటేషన్‌కు సంబంధించి జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లు, ఖాళీ స్థలాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో 141 వాటర్‌ లాకింగ్‌ పాయింట్స్‌ను గుర్తించామని, నీటిని తొలగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వం పక్షాన జీహెచ్‌ఎంసీకి అన్ని సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఏ సమస్య వచ్చినా అందరం కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండేలా ఒక నెంబర్‌ను ఉంచాలని అధికారులను ఆదేశించారు.
లేక్‌ ప్రొటెక్షన్‌ ముఖ్యమైందని, అక్కడ అభివృద్ధికి బాధ్యత తీసుకోవాలని ఐటీ కంపెనీలను ఆదేశించారు. హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచాలని, ఏ సమస్య ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అన్నారు. నాలాల్లో సిల్ట్‌ తీయడంపై గతంలో ఆరోపణలు వచ్చాయని, ఈసారి అందరి సహకారంతో ముందుకెళ్తామన్నారు. సిల్ట్‌ తీయడంపై అవినీతి జరిగిందంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుక్కలతో నగర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ సజావుగా జరగాలని, క్షేత్ర పరిధిలో పర్యవేక్షించాలని అన్నారు. రెస్టారెంట్లు, హౌటళ్లలో నాణ్యమైన, హైజనిక్‌ ఫుడ్‌ అందించేలా చూడాలని చెప్పారు.
ఈ సమావేశంలో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఇన్‌చార్జి కమిషనర్‌ ఆమ్రపాలి, జోనల్‌ కమిషనర్లు, ఈఎన్‌సి జియా ఉద్దీన్‌, ఈవీడిఎం డైరెక్టర్‌ ప్రకాష్‌ రెడ్డి, ఎస్‌ఎన్‌డిపి సిఈ కోటేశ్వరరావు, సీఈ దేవానంద్‌, జోనల్‌ కమిషనర్లు, స్నేహ శబరిష్‌, అభిలాష అభినవ్‌, హేమంత్‌ సహదేవ్‌రావు, రవి కిరణ్‌, వెంకన్న, అడిషనల్‌ కమిషనర్లు కె.శ్రీవాత్సవ, సత్యనారాయణ, ఉపేందర్‌ రెడ్డి, రాచకొండ, హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ట్రాఫిక్‌ ఏసీపీలు, జలమండలి నుంచి డైరెక్టర్లు అజ్మీరాకృష్ణ, స్వామి, ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు, విద్యుత్‌ విభాగం, ట్రాఫిక్‌ విభాగం, వాటర్‌ బోర్డ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love