పోడు భూముల జోలికెళ్లొద్దు..

పోడు భూముల జోలికెళ్లొద్దు..– కొత్తగా అడవిని నరకనివ్వొద్దు : మంత్రి సీతక్క
– ఆసిఫాబాద్‌ జిల్లాలో అభివృద్ధి పనులు ప్రారంభం
నవతెలంగాణ-ఆసిఫాబాద్‌
ప్రస్తుతం పోడు సాగు చేసుకుంటున్న భూముల జోలికి వెళ్లకూడదని, కొత్తగా అడవులను నరికి సాగు చేయకుండా చూడాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభి వృద్ధి, స్త్రీ,శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అధికారులకు సూచించారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో బుధవారం మంత్రి పర్యటిం చారు. ఆసిఫాబాద్‌ మండలంలోని మోతుగూడ, అప్పపెల్లి గ్రామాల మధ్యలోగల వాగుపై రూ.కోటి 82 లక్షలతో నిర్మిస్తున్న హైలెవల్‌ వంతెన పనులను జెడ్పీ చైర్మెన్‌ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్‌బాబు, కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారీ, దాసరివేణుతో కలిసి పరిశీలించారు. ఆసిఫాబాద్‌ మండలంలోని వాడిగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల కింద రూ.6 లక్షలా 20 వేలతో నిర్మించిన గదులను ప్రారంభించారు. జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలను అందజేశారు. జిల్లా కేంద్రంలో రూ.25 లక్షల నిధులతో నిర్మించనున్న ప్రెస్‌క్లబ్‌ భవనానికి భూమి పూజ చేశారు. ఇటీవల మరణించిన ఈనాడు పత్రిక వ్యవస్థాపకుడు రామోజీరావుకు మంత్రి సీతక్క ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు విశ్వ ప్రసాద్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, జడ్పీటీసీ నాగేశ్వరరావు, ఎంపీపీ మల్లికార్జున్‌, ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా మంత్రి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఉట్నూర్‌ ఐటీడీఏ పీఓ కుష్బు గుప్తా, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీ తదితరులతో కలిసి శాఖల పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోడు భూముల సమస్య రోజురోజుకూ పెరుగుతోందని, ఇప్పటికే సాగు చేసుకుంటున్న భూముల జోలికి వెళ్లొద్దని అధికారులను మంత్రి ఆదేశించారు.

Spread the love