మా భూములు లాక్కోవద్దు

మా భూములు లాక్కోవద్దు– మంత్రి కోమటిరెడ్డి కాన్వారును అడ్డుకున్న రింగురోడ్డు నిర్వాసితులు
– రోడ్డున పడేయొద్దంటూ వేడుకోలు
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
రింగ్‌ రోడ్డు నిర్మాణం కోసం తమ భూములను లాక్కోవద్దని కోరుతూ రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్వారుని ఆదివారం నిర్వాసితులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. నల్లగొండ జిల్లా కనగల్‌ మండలం ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ దేవి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు వెళుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాన్వారుని నిర్వాసితులు అడ్డుకున్నారు. తమ బతుకులు రోడ్డున పడేయొద్దంటూ మంత్రిని వేడుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. రెండు నెలలుగా తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నా ఎవరూ తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలైన్‌మెంట్‌ 3 ప్రకారం కాకుండా అలైన్‌మెంట్‌ 1 ప్రకారం రింగురోడ్డును నిర్మించి తమ ఇండ్లు, ప్లాట్లకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఇప్పటికే రోడ్డు నిర్మాణ ప్రక్రియ పూర్తైందని మంత్రి చెప్పడంతో నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు.
మంత్రి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా : కవిత, కేశరాజుపల్లి, భూనిర్వాసితురాలు
అలైన్‌మెంట్‌ 3 ప్రకారం రింగ్‌ రోడ్డు నిర్మిస్తే మంత్రి వెంకట్‌రెడ్డి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటా. తనకు ఎస్‌ఎల్‌బీసీ వద్ద 201 గజాల ప్లాటు ఉంది. దాన్ని కట్నం కింద రూ.30 లక్షలకు తన అల్లునికి ఇచ్చా. ప్రస్తుతం రింగ్‌ రోడ్డు నిర్మాణం వల్ల ప్లాటు మొత్తం పోతుండటంతో అల్లుడు తన బిడ్డను పుట్టింటికి పంపించాడు. ఇప్పుడు మేుం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నాం. తమకు న్యాయం చేయాలి.
మంత్రికి తప్పుడు సమాచారం : విజయలక్ష్మి, భూనిర్వాసితురాలు
రింగ్‌ రోడ్డు నిర్మాణం వల్ల జరుగుతున్న నష్టంపై కొంతమంది మంత్రి వెంకట్‌రెడ్డికి తప్పుడు సమాచారం అందిస్తున్నారు. అలైన్‌మెంట్‌ 3 ప్రకారం రోడ్డు నిర్మాణం చేపడితే 2800 ప్లాట్లు, 200 ఇండ్లు కోల్పోవాల్సి వస్తుంది. అయితే మంత్రి మాత్రం కేవలం 60 మందికి మాత్రమే నష్టం కలుగుతుందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమకు సమయం ఇస్తే మూడు వేల మంది నిర్వాసితులతో కలుస్తాం.
తనకు మెడికల్‌ కళాశాల ఎదుట 400 గజాల ప్లాటు ఉంది. ప్రస్తుతం ఇక్కడ గజం ధర రూ.20,000. ప్రభుత్వం మాత్రం నష్టపరిహారం కింద గజానికి నాలుగైదు వేలు ఇస్తే ఎలా? అప్పులు చేసి ప్లాటును కొనుగోలు చేస్తే.. అప్పు కూడా తీర్చకముందే ఆ ప్లాటు పోయే పరిస్థితి వచ్చింది. రింగ్‌ రోడ్డు నిర్మాణంపై పునరాలోచన చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం.

Spread the love