– పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి : ప్రొఫెసర్ హరగోపాల్
– ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో కార్మిక గర్జన
నవతెలంగాణ- అడిక్‌మెట్
కనీస వేతనాల జీవోలను ఎందుకు సవరించలేదో సమాధానం చెప్పాలని, గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస వేతనాల జీవోలు విడుదల, కాంట్రాక్ట్ వర్కర్స్ రెగ్యులరైజ్, అసంఘటిత కార్మికులకు కనీస పెన్షన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణ ఆధ్వర్యంలో కార్మిక గర్జన మహాధర్నా జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండున్నర లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉన్నారని తెలిపారు. అందరినీ పర్మినెంట్ చేస్తానన్న సీఎం కేసీఆర్ 9 ఏండ్లు గడుస్తున్నా ఉలుకూ, పలుకూ లేకుండా ఉన్నారని విమర్శించారు. 2016లో సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. కనీస వేతనాల జీవోలను ఎందుకు సవరించలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల కిందట ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చి ఐదు జీవోలను నేటికీ గెజిట్ ముద్రించలేదన్నారు. లక్ష మంది బీడీ కార్మికులు, నెలసరి ఉద్యోగులు, ప్యాకర్స్, కమీషన్ ఏజెంట్లు జీవన భృతికి నోచుకోవడం లేదని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో 60 ప్రకారం రూ.16,500 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఆటో మోటార్, హమాలీ కార్మికులకు సంక్షేమ ఫలాలు అందడం లేదన్నారు. అసంఘటితరంగ కార్మిక సామాజిక భద్రతా చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని, కార్మికులరందరికీ కనీస పెన్షన్ నిర్ణయించాలని కోరారు.మహాధర్నాలో సీపీఐ (ఎం-ఎల్) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పి.రంగారావు, అస్సాం కార్మిక సంఘం నాయకులు దేవ్ బ్రదర్ శర్మ, ఢిల్లీ కార్మిక నేత సంజరు సింగ్, ఐఎఫ్‌ఏయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం, కేజీబీవీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎల్. పద్మ, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు యం.హన్మేష్, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.నరేందర్, ఐఎఫ్‌ఏయు రాష్ట్ర కార్యదర్శి జి.రామయ్య, తెలంగాణ ప్రగతిశీల హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సి.వెంకటేష్, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.