సమాజహిత కార్యక్రమాలకు దాతలు ముందుకు రావడం అభినందనీయం….

– జిల్లా కలెక్టర్ హనుమంతు కె జండాగే….
నవతెలంగాణ-భువనగిరి రూరల్ : సమాజహిత కార్యక్రమాలకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టరు హనుమంతు కే జెండగే అన్నారు. గురువారం నాడు కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాలులో పదవ తరగతి పరీక్షలకు ప్రత్యేక తరగతుల నిర్వహణలో విద్యార్థులకు అల్పాహార పంపిణీ కార్యక్రమానికి ఆర్ధిక తోడ్పాటు అందించేందుకు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున 4 లక్షలు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గంపా నాగేందర్ తల్లి గారు శ్రీమతి మంచాల సరోజనమ్మ పేరు మీద ఒక లక్ష రూపాయలు, ఆత్మకూర్ మండలంలోని సోనాలికా షోరూమ్ వారు 25 వేల రూపాయల చెక్కులను జిల్లా కలెక్టరు సమక్షంలో జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి కి అందజేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ  దాతలు ముందుకు వచ్చి పదవ తరగతి విద్యార్దినీ విద్యార్ధులకు అల్పాహారం పథకం అందించడం అభినందనీయమని, ఈసందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ ఆర్ధిక సహాయం అందించడంలో ముందున్న  జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టరు ఏ భాస్కరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి కె నారాయణరెడ్డి లను అభినందించారు. సమాజానికి తోడ్పడే ఇలాంటి సేవా కార్యక్రమాలలో దాతలు ముందుండాలని అన్నారు. అల్పాహార పథకం పదవతరగతి పిల్లలకు సహాయకారిగా వుంటుందని, జిల్లాలోని 17 మండలాలకు గాను యాదగిరిగుట్ట, రాజపేట, వలిగొండ 3 మండలాలలో దాతల సహకారంతో అల్పాహారం అందించడం జరుగుతున్నదని, మిగిలిన 14 మండలాలకు సంబంధించి ఈరోజు అందించిన ఆర్థిక తోడ్పాటుతో 4001 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ విద్యార్ధులకు పరీక్షల వరకు ప్రతి రోజూ పండ్లు, చుడువా, ఉప్మా, ఉడకబెట్టిన గింజలు, బిస్కట్స్ అందించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. పదవ తరగతి పరీక్ష ప్రతి విద్యార్థికి టర్నింగ్ పాయింట్ అని, పరీక్షల పన్నద్ధంలో భాగంగా వారికి నిర్వహించే ప్రత్యేక తరగతులలో విద్యార్థులు ఇంకా కాసేపు చదువుకోవడానికి వీలుగా అల్పాహారం అందిస్తే ఎంతో తోడ్పాటు అందుతుందని, ఈ అల్పాహార కార్యక్రమాన్ని పక్కాగా, క్వాలిటీగా, టైం ప్రకారం పిల్లలకు అందించాలని, అలాగే చదువులో వెనుకబాటువున్న విద్యార్ధుల పట్ల మరింత ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత చెందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ పి నాగభూషణం మాట్లాడుతూ ఇలాంటి ఉపయోగకరమైన కార్యక్రమాలలో ముందుంటామని, ధాన్య కొనుగోళ్లలో జిల్లా యంత్రాంగం అందించిన తోడ్పాటుతో రైతుల నుండి ధాన్యం కొనుగోళ్లు పక్కాగా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులను జిల్లా కలెక్టరు సన్మానించారు.ఈ కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Spread the love