నిరాశకు లోనుకావద్దు…అధైర్యపడొద్దు

Don't despair...don't get discouraged– వంద రోజుల్లో పార్టీ అధికారంలోకి వస్తుంది
– మీ తలరాతను మారుస్తుంది : కౌలు రైతులకు  రేవంత్‌ బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వంద రోజుల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తోందనీ, మీ తలరాతను మారుస్తోందని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి కౌలు రైతులకు భరోసా ఇచ్చారు. ఎవరూ నిరాశకు లోనుకావద్దనీ, అధైర్యపడొద్దని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు బుధవారం కౌలు రైతులకు రేవంత్‌ బహిరంగ లేఖ రాశారు. గతేడాది మేలో రాహుల్‌ గాంధీ సమక్షంలో వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌ ప్రకటించిందని తెలిపారు. రైతు డిక్లరేషన్‌ ప్రకారం ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు కూడా ప్రతి ఎకరాకు, ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం చేస్తామని హామీ ఇచ్చామని తెలిపారు. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు ఇస్తామని భరోసా ఇచ్చారు. రైతులు పండించిన అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందనీ, మెరుగైన పంటల బీమా పథకాన్ని తెచ్చి… ప్రకృతి విపత్తుల వల్లనో, మరో కారణంగానో పంట నష్టం జరిగితే శరవేగంగా నష్టం అంచనా వేయించి…పరిహారం అందేలా చూస్తామని పేర్కొన్నారు.
రైతులను గాలికొదిలేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఏవో చేస్తాయని ఆశలు పెట్టుకోవడం దండగ అని పేర్కొన్నారు. కౌలురైతు కూడా రైతేనని తెలిపారు. వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి, రుణాలతోసహా అన్ని పథకాలను వర్తింపజేస్తూ గతంలో కౌలు రైతుల గుర్తింపు చట్టం చేసింది కాంగ్రెస్‌ పార్టీయేనని గుర్తు చేశారు. రైతులకు పావలావడ్డీకే రుణాలు, పంటల బీమా, రైతు బీమా, ఇందిర జలప్రభ, రాయితీ విత్తనం, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పండిన పంటకు మద్దతు ధర, పంటల కొనుగోలుకు ఐకేపీ కేంద్రాల ఏర్పాటు వంటి సమగ్ర రైతు అనుకూల నిర్ణయాలతో వ్యవసాయాన్ని పండగ చేసింది కాంగ్రెస్‌ పార్టీ తెలిపారు.

Spread the love