నవతెలంగాణ-తుంగతుర్తి
క్షయ రహిత సమాజమే మన అందరి లక్ష్యమని, క్షయ రహిత సమాజం కోసం కృషి చేయాలని రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి ఆదేశాల మేరకు రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో, మండల పరిధిలోని సూర్యతండ, జి.కె తండలలో సోమ, మంగళ వారాలలో కుష్టు వ్యాధి ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి కుష్ఠు వ్యాధి లక్షణాలపై పరిశీలన చేపట్టడంతో పాటు, ప్రజలకు వ్యాధి లక్షణాలు, ప్రారంభ దశలో గుర్తింపు, చికిత్స నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
అలాగే అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి అవసరమైన వైద్య పరీక్షలు, తదుపరి చికిత్స కోసం చర్యలు తీసుకున్నారు. ఈ రెండు రోజుల సర్వే కార్యక్రమంలో మొత్తం 184 గృహాలను సందర్శించి, 742 మంది ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఆరోగ్య సిబ్బందికి సహకరించడంతో సర్వే సమర్థవంతంగా పూర్తయిందని తెలిపారు. కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి పట్ల అపోహలు లేకుండా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని వైద్యాధికారి డా. లింగమూర్తి ప్రజలకు సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఇలాంటి సర్వేలు వ్యాధి నిర్మూలనకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు డిపిఎంవోలు సురేష్ కుమార్, సురేష్ బాబు, అనిల్ కుమార్, కృష్ణయ్య, పిహెచ్ఎన్ మాణిక్య, ఏఎన్ఎంలు భారతి, శైలజ, హెల్త్ అసిస్టెంట్లు లకావత్ యాదగిరి, నరసింహచారి, ఆశా కార్యకర్తలు జె.విమల, కె.సరిత, జి.కమల తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది అందించిన సహకారానికి వైద్యాధికారి డా.లింగమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.



