ఆర్చరీలో డబుల్‌ ధమాకా

Double bang in archery–  అదితికి పసిడి, సురేఖకు కాంస్యం
–  ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌
బెర్లిన్‌ (జర్మనీ) : ప్రపంచ సీనియర్‌ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో భారత ఆర్చర్ల పతక జోరు కొనసాగుతుంది. శుక్రవారం మహిళల జట్టు విభాగంలో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌లు పసిడి పతకంతో సరికొత్త రికార్డు సృష్టించగా.. శనివారం సైతం పతకాల పంట పండింది. గత నెలలో జూనియర్‌ ఆర్చరీ వరల్డ్‌కప్‌లో పసిడి సాధించిన అదితి స్వామి.. తాజాగా 17 ఏండ్ల వయసులోనే సీనియర్‌ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా అవతరించి రికార్డు సృష్టించింది. మహిళల వ్యక్తిగత కాంపౌండ్‌ విభాగంలో యువ ఆర్చర్‌ ఆదితి స్వామి పసిడి వెలుగులు వెలిగించింది. మెక్సికో ఆర్చర్‌ ఆండ్రీయ బెకెర్రాతో పసిడి పోరులో అదితి స్వామి 149-147తో అద్వితీయ విజయం సాధించింది. అంతకముందు జరిగిన ఆల్‌ ఇండియన్‌ సెమీఫైనల్లో సీనియర్‌ ఆర్చర్‌, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖపై అదితి స్వామి 149-145తో విజయం సాధించింది. సహచర ఆర్చర్‌ చేతిలో ఓటమి నుంచి వేగంగా పుంజుకున్న జ్యోతి సురేఖ.. కాంస్య పతక పోరులో సత్తా చాటింది. టర్కీ ఆర్చర్‌ ఐపెక్‌ టోమర్క్‌పై 150-146తో పర్‌ఫెక్ట్‌ స్కోరుతో సత్తా చాటింది. దీంతో ఒకే ఈవెంట్‌లో భారత్‌ పసిడి, కాంస్య పతకాలు సాధించి డబుల్‌ ధమాకా చూపించింది.

Spread the love