– ఉపాధ్యాయ పోస్టులు 11,062
– పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు
– అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు : పాఠశాల విద్యాశాఖ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దయ్యింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గురువారం కొత్తగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్ ఆరో తేదీన డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆ దరఖాస్తులను కొత్త నోటిఫికేషన్‌లో పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు. వారు మళ్లీ దరఖాస్తు చేయొద్దని కోరారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ను గురువారం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వం 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీని నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఉపాధ్యాయ పోస్టులను పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో గత నోటిఫికేషన్‌లో ఉన్న 5,089 ఉపాధ్యాయ పోస్టులకు అదనంగా 5,973 పోస్టులను కలిపి 11,062 పోస్టులను భర్తీ చేయనుంది. అయితే స్పెషల్ టీచర్ పోస్టులు 1,523 ఉన్నాయి. అందులో 507 పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 1,016 పోస్టులను నేరుగా భర్తీ చేస్తారు. డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) 2,849 పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) 7,304 పోస్టులు, పండితులు 727 పోస్టులు, పీఈటీలు 182 పోస్టులున్నాయి. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2017, అక్టోబర్ 21న ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ను మొదటిసారి జారీ చేసింది. ఆ నియామకాల ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. మళ్లీ గతేడాది సెప్టెంబర్ ఆరో తేదీన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెండోసారి నోటిఫికేషన్‌ను విడుదల అయ్యింది. అదనంగా మరిన్ని పోస్టులను కలిపి కొత్తగా నోటిఫికేషన్‌ను విద్యాశాఖ గురువారం జారీ చేయనుంది.
మేలో డీఎస్సీ రాతపరీక్షలు?
డీఎస్సీ రాతపరీక్షలు మేలో నిర్వహించే అవకాశముందని విశ్వసనీయంగా తెలిసింది. వచ్చేనెలలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఏప్రిల్‌లో పోలింగ్ ఉంటుంది. మే రెండో వారం వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. దీంతో మే మూడో వారం లేదా నాలుగో వారంలో డీఎస్సీ రాతపరీక్షలను నిర్వహించే అవకాశమున్నది. ఇంకోవైపు బీఆర్‌ఎస్ ప్రభుత్వం డీఎస్సీ రాతపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. గురువారం విడుదల చేసే నోటిఫికేషన్‌లో స్పష్టత ఇవ్వనుంది.
డీఎస్సీ వివరాలు
కేటగిరీ పోస్టులు
స్కూల్ అసిస్టెంట్ 2,849
ఎస్జీటీ 7,304
పండితులు 727
పీఈటీలు 182
మొత్తం 11,062