డుప్లెసిస్‌ ధనాధన్‌

డుప్లెసిస్‌ ధనాధన్‌– రాణించిన విరాట్‌ కోహ్లి
– టైటాన్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
– గుజరాత్‌ 147/10, బెంగళూర్‌ 152/6
నవతెలంగాణ-బెంగళూర్‌
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే ఊదేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ 17వ సీజన్లో నాల్గో విజయం నమోదు చేసింది. ఛేదనలో కెప్టెన్‌ డుప్లెసిస్‌ (64, 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), విరాట్‌ కోహ్లి (42, 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) వీర విహారం చేశారు. తొలి వికెట్‌కు 5.5 ఓవర్లలోనే 92 పరుగులు జోడించిన ఓపెనర్లు గెలుపు లాంఛనం చేశారు. విల్‌ జాక్స్‌ (1), రజత్‌ పాటిదార్‌ (2), మాక్స్‌వెల్‌ (4), కామెరూన్‌ గ్రీన్‌ (1) నిరాశపరిచినా.. దినేశ్‌ కార్తీక్‌ (21 నాటౌట్‌, 12 బంతుల్లో 3 ఫోర్లు), స్వప్నిల్‌ సింగ్‌ (15 నాటౌట్‌, 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) లాంఛనం ముగించారు. టైటాన్స్‌ బౌలర్‌ జోశ్‌ లిటిల్‌ (4/45) రాణించాడు. తొలుతు బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్‌ మహ్మద్‌ సిరాజ్‌ (2/29), యశ్‌ దయాల్‌ (2/21), విజరు కుమార్‌ వైశాక్‌ (2/23) విజృంభించటంతో 19.3 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది.
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌కు ఆర్సీబీ బౌలర్లు చుక్కలు చూపించారు. పవర్‌ప్లేలోనే టైటాన్స్‌కు ముకుతాడు వేశారు. వృద్దిమాన్‌ సాహా (1), శుభ్‌మన్‌ గిల్‌ (2)లను సిరాజ్‌ అవుట్‌ చేయగా.. సాయి సుదర్శన్‌ (6)ను కామెరూన్‌ గ్రీన్‌ సాగనంపాడు. ఆరు ఓవర్లలో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ టైటాన్స్‌ స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించింది. కానీ షారుక్‌ ఖాన్‌ (37), డెవిడ్‌ మిల్లర్‌ (30) టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మిల్లర్‌, షారుక్‌ స్వల్ప వ్యవధిలో డగౌట్‌కు చేరుకోవటంతో టైటాన్స్‌ కథ మళ్లీ మొదటికొచ్చింది. రాహుల్‌ తెవాటియ (35), రషీద్‌ ఖాన్‌ (18) డెత్‌ ఓవర్లలో మెరవటంతో గుజరాత్‌ టైటాన్స్‌ 147 పరుగులు చేసింది.

Spread the love