దశాబ్ది ఉత్సవాల్లో ఇండ్లు.. గుడిసెల జాడేది?

– అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌
– గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చే వరకూ పోరాటం ఆగదు : ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య
– గోవిందరావుపేట, భూపాలపల్లిలో బస్సుయాత్రకు ఘన స్వాగతం
నవతెలంగాణ-గోవిందరావుపేట/భూపాలపల్లి
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఇల్లు, ఇండ్ల స్థలాల జాడేదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ ప్రశ్నించారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ గృహాల సాధనకై ప్రజాసంఘాల ఐక్య పోరాట వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర మంగళవారం ములుగు జిల్లా గోవిందరావుపుట మండలానికి చేరుకుంది. బస్సుయాత్ర బృందానికి స్వాగతం పలుకుతూ వందలాది మంది డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు.. రెడ్‌ టీ షర్ట్ల్సు ధరించి ఎర్రజెండాలు కట్టిన బైకులతో పసర గుడిసెవాసుల ప్రాంతానికి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పసరలో సభ నిర్వహించారు. అక్కడ నుంచి జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్న బస్సు యాత్రకు డప్పు చప్పుళ్ళు బోనాలతో నృత్యం చేస్తూ బృందానికి స్వాగతం
దశాబ్ది ఉత్సవాల్లో ఇండ్లు.. గుడిసెల జాడేది?
పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎర్ర చెరువు శిఖం భూమిలో పేదలు వేసుకున్న గుడిసెల వద్ద బహిరంగ సభ నిర్వహించారు.
పసర గుడిసెవాసుల ప్రాంతంలో నాయకులు పొదిళ్ల చిట్టిబాబు అధ్యక్షతన నిర్వహించిన సభకు వెంకట్‌ హాజరై మాట్లాడారు. కోట్ల రూపాయలు వెచ్చించి 20 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను రోజుకో పేరుతో నిర్వహిస్తోందన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఇండ్ల కోసం గుడిసె వాసులు చేస్తున్న పోరాటాలు, వారి కష్టాలు ప్రభుత్వానికి కనబడలేదా అని ప్రశ్నించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వమూ ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పిందని, అయినా ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ ఇచ్చిన పాపానపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలను నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఇండ్ల కోసం ఢిల్లీ స్థాయిలో ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌ వీరయ్య మాట్లాడుతూ.. ఇండ్లు, ఇండ్ల స్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 61 ప్రాంతాల్లో గుడిసె వాసులు చేస్తున్న పోరాటాలకు మద్దతుగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో ఇండ్ల ఉత్సవాల ప్రస్తావన లేకపోవడం పేదవారి గృహాలపై ప్రభుత్వానికి ఉన్న సవతి ప్రేమను తెలియజేస్తుందన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా బెదిరింపులకు పాల్పడినా తట్టుకొని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. లక్షలాది విలువైన భూములు అన్యాక్రాంతం కాకుండా పేద ప్రజానీకానికి ఉపయోగపడే విధంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్నామని అన్నారు.
భూపాలపల్లిలోని ఎర్ర చెరువు శిఖం భూమిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు అధ్యక్షతన జరిగిన సభలో ప్రజాసంఘాల ఐక్య పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌. వీరయ్య మాట్లాడారు. నివసించే వారికి కూడు, గూడు, ఉపాధి కల్పించాలని రాజ్యాంగంలో ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ఏర్పడిన కాలనీ ఒక్కటి కూడా లేదని, మొత్తం ఎర్రజెండా వేసుకున్న గుడిసెలేనని స్పష్టంచేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా బెదిరింపులకు పాల్పడినా పేదలకు స్థలాలు పంపిణీ చేసేవరకు ప్రజా సంఘాలు అండగా ఉంటాయని స్పష్టం చేశారు.
యాత్రలో.. కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్‌ బాబు, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి పైల్ల ఆశయ్య, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి జగదీష్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్‌, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బి రెడ్డి సాంబశివ, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బి. సంజీవ, గొర్ల కాపరుల సంఘం మండల నాయకులు కడారి నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్‌ నాయకులు అంబాల పోషాలు, ఐద్వా నాయకులు కవిత, గుడిసెవాసుల పోరాట కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love