– మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలతోనే..
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రైతుబంధు పంపిణీని నిలిపివేస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్‌రావు రైతు బంధు పంపిణీపై ప్రకటన చేయడంతో ఈనెల 24వ తేదీ ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్టు సోమవారంనాటి రాతపూర్వక ఉత్తర్వుల్లో ఈసీ పేర్కొంది. ఈనెల 24వ తేదీ రైతుబంధు పంపిణీకి ఈసీ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 28వ తేదీ లోపు రైతులకు రైతుబంధు చెల్లించాలని షరతు విధించింది. దానితో పాటు రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లో పడే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించ వద్దనీ, ప్రచారం ముగిశాక, పోలింగ్ జరిగే 30వ తేదీ కూడా పంపిణీ చేయోద్దనీ, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించకుండా పంపిణీ జరగాలని షరతులు విధించింది. అయితే ఈనెల 25,26,27 తేదీల్లో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. దీనితో 28వతేదీ (మంగళవారం) ఉదయం రైతులు ఇండ్లలో టీ తాగడానికంటే ముందే వారి ఖాతాల్లో రైతుబంధు సొమ్ములు పడి, ఫోన్లు టింగ్, టింగ్ అని మోగుతాయంటూ ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు ఈనెల 25వ తేదీ నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించారు. దీన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. తాము విధించిన షరతులు ఉల్లంఘించి, ఎన్నికల ప్రచారంలో రైతుబంధు అంశాన్ని ప్రస్తావించినందున ఈనెల 24న ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీనితో రాష్ట్రంలో మరోసారి రాజకీయ వేడి భగ్గుమంది. రైతుబంధు రద్దు అంశం తెలియగానే… మంత్రి హరీశ్‌రావు వల్లే రైతుబంధు ఆగిందనీ, ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని ఓట్ల కోసం వాడుకునే కక్కుర్తికి పాల్పడ్డారంటూ పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ఫిర్యాదుల వల్లే రైతుబంధు ఆగిందంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు, మంత్రులు టీ హరీశ్‌రావు, కే తారక రామారావు, ఎమ్మెల్సీ కవిత తదితరులు వేర్వేరు వేదికలపై ప్రకటనలు చేశారు. రైతుబంధు నిలిపివేతకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కారణమని బీజేపీ వ్యాఖ్యలు చేసింది. అయితే రైతుబంధు నిలిపివేత ఉత్తర్వుల్లో కేంద్ర ఎన్నికల సంఘం మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యల్నే ప్రస్తావించింది తప్ప, ఎక్కడా కాంగ్రెస్ పేరు లేకపోవడం గమనార్హం.