మోడీ హయాంలో ఆర్థిక స్థితి దుర్భరం

Under Modi
Economic condition is poor– ధరలు పెరుగుదల, నిరుద్యోగంపై దేశవ్యాప్త పోరు
– సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు ఆందోళనలు
– బీజేపీని ఏకాకిని చేసి ఓడించేందుకు ఉమ్మడి ప్రయత్నాలు
– ఎస్కేఎం, కార్మిక సంఘాల ఆందోళనకు మద్దతు
– లైంగికదాడులకు వ్యతిరేకంగా మహిళా ర్యాలీకి మద్దతు
– పార్లమెంట్‌లో చర్చ లేకుండా కీలక బిల్లు ఆమోదం దారుణం : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మోడీ ప్రభుత్వం దేశాన్ని ఆర్థికంగా దుర్భర స్థితికి తీసుకొచ్చిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. దేశంలో ప్రజలు ఎదుర్కొం టున్న ప్రధాన సమస్యలు ధరల పెరుగుదల, నిరుద్యోగంపై వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్టు తెలిపారు. సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆందోళనలకు కేంద్ర కమిటీ పిలుపు ఇచ్చిందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ (హెచ్‌కెఎస్‌) భవన్‌లో జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిశాయి. అనంతరం సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర కమిటీ నిర్ణయాలను వెల్లడించారు. ప్రజల జీవనోపాధి తదితర సమస్యలపై వామపక్షాలతో చర్చించి, ఆందోళన కార్యక్రమం రూపొందిస్తామని తెలిపారు. కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ, సంయుక్త కిసాన్‌ మోర్చా ఉమ్మడిగా పిలుపు ఇచ్చిన ఆందోళనలకు కేంద్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతున్న తీరుపై కేంద్ర కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని, మహిళా సంఘం నిర్వహించే ర్యాలీకి మద్దతు ప్రకటించిందని తెలిపారు.
బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా వ్యూహ రచన
”ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై చర్చించాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఏకాకిని చేసి ఓడించడానికి ఎలాంటి ఉమ్మడి ప్రయత్నాలు చేయాలనేదానిపై చర్చించాం. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. సంప్రదింపులు జరుగుతున్నాయి. ముంబయిలో ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1న జరగబోయే ఇండియా వేదిక సమావేశంలో మరిన్ని పార్టీలు చేరే అవకాశం ఉంది. అన్ని కూటములు, పొత్తులు, సీట్ల పంపకాలు, అవగాహనలు రాష్ట్ర స్థాయిల్లోనే ఉండాలని అన్ని పార్టీలు అంగీకరించాయి. రాష్ట్ర స్థాయిల్లో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉంది. తదనుగుణంగా బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు వ్యూహ రచన చేస్తున్నాం. కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎఫ్‌ మధ్య పోటీ ఉంది. పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష కూటమి, కాంగ్రెస్‌, ఇతర లౌకిక పార్టీలు టీఎంసీ, బీజేపీలతో తలపడనున్నాయి. బీహార్‌లో మహా కూటమి, మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడి, తమిళనాడులో లౌకిక కూటమి ఇలా ప్రతి రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిల్లో బీజేపీ వ్యతిరేక ఓటును గరిష్టం చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓటును సమన్వయం చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు చేసుకున్న ఒప్పందమే భారత్‌ కూటమి. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిల్లో ఎటువంటి కూటమి లేదు” అని తెలిపారు.
గందరగోళం మధ్య కీలక బిల్లుల ఆమోదం సరికాదు
గందరగోళం మధ్య పార్లమెంట్‌లో కీలక బిల్లులను ఆమోదించడం దారుణమని విమర్శించారు. మణిపూర్‌ అంశంపై ప్రధాని మోడీ జవాబుదారీతనంగా లేకపోవడమే పార్లమెంట్‌ అంతరాయాలకు కారణమని పేర్కొన్నారు. భారీ స్థాయిలో అడవిని నిర్మూలించడం, అడవి ప్రాంతాల్లో ప్రయివేట్‌ మైనింగ్‌కు అనుమతి ఇస్తూ తీసుకొచ్చిన అటవీ సంరక్షణ సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించుకున్నారని, దీనిపై రాబోయే రోజుల్లో భారీ పోరాటాలు జరుగుతాయని హెచ్చరించారు. అటవీ నిర్మూలన వాతావరణ మార్పులపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని, గతంలో ఎన్నడూ లేనంతంగా అకాల వరదలు, వర్షాలు, భూ కంపం, కొండచరియలు విరిగిపడటం, తీవ్రమైన వేడి వంటి వాతావరణ ప్రభావ చర్యలతో ప్రజలు ఇప్పటికే ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నియంత్రణంలో ఉండే ఖనిజాలు మరి ముఖ్యంగా లిథియం వంటి మైనింగ్‌ను ప్రయివేటీకణ చేస్తూ బిల్లు ఆమోదించారని విమర్శించారు. భవిష్యత్తులో గ్రీన్‌ ఎనర్జీకి అవసరమైన బ్యాటరీ ఉత్పత్తిలో కీలకమై లిథియంను కార్పొరేట్‌ వ్యక్తుల మరి ముఖ్యంగా బహుల జాతి కంపెనీల చేతులకు అందజేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది దేశ ప్రయోజనాలకు నష్టం చేస్తుందని అన్నారు. ఇలాంటి బిల్లులను ఆమోదించి, దేశ సంపదను దోచుకోవడానికి అనుమతి ఇస్తున్నారని విమర్శించారు.
రాహుల్‌ గాంధీపై అనర్హత ఎత్తివేయాలి
ఇప్పుడు ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకునేందుకు మోడీ ప్రభుత్వం క్రిమినల్‌ పరువు నష్టం కేసుల మార్గాన్ని ఎంచుకుందని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐ తరువాత ఇప్పుడు మరొక కొత్త మార్గాన్ని అనుసరిస్తుందని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కోర్టు ఆదేశాలను చూపించి రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని, కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు రాహుల్‌ గాంధీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినా ఆయన పార్లమెంట్‌ సభ్యత్వం పునరుద్ధరించకపోవడం దారుణమన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఒక్కటే ఇవ్వలేదని, కింది కోర్టుల విచారణ, పరిశీలనపై తీవ్రంగా వ్యాఖ్యలు చేసిందని తెలిపారు. గరిష్ట శిక్షకు గల కారణాలు కూడా తెలపకుండా కింది కోర్టు తీర్పు ఇచ్చిందని సుప్రీం కోర్టు పేర్కొందన్నారు. కింది కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించిందని, ఏ విధంగా వేగవంతంగా ఆయనపై అన్హరత వేటు వేశారో, అదే వేగంతో ఆయనపై అనర్హత వేటు ఎత్తివేయాలని అన్నారు.
హర్యానాలో బీజేపీ బుల్డోజర్‌ రాజకీయాలు
హర్యానా బీజేపీ ప్రభుత్వం అల్లర్ల అణచివేత పేరుతో మైనార్టీలను హించడం సరికాదన్నారు. వివక్షాపూరిత అరెస్టులు, బుల్డోజర్‌ రాజకీయలను కేంద్ర కమిటీ ఖండించిందని అన్నారు. చాలా మంది వద్ద ఆస్తి పత్రాలు ఉన్నప్పటీకి, కూల్చివేతకు వ్యతిరేకంగా స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నప్పటికీ కూల్చివేతలు యథాతధంగా కొనసాగుతున్నాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మతోన్మాద ఘర్షణలను రేపుతోందని ధ్వజమెత్తారు. సాధారణ పరిస్థితులు పునరుద్ధరించి, శాంతిని స్థాపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, కానీ మైనార్టీ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని మత విభజనకు అవకాశం కల్పిస్తుందని విమర్శించారు. ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం శాంతి భద్రతలకు, మత సామరస్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. దీన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందని, మతోన్మాద ఘర్షణలకు పాల్పడిన వారిని శిక్షించాలని అన్నారు. తప్పు ఎవరు చేశారో వారిపై చర్యలు తీసుకోవాలని, అంతేతప్ప ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకొని బుల్డోజర్‌ రాజకీయాలు చేయడం లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంలో అంగీకరించదగినది కాదని పేర్కొన్నారు.

Spread the love