నవతెలంగాణ – మిరుదొడ్డి
కేరళ మాజీ ముఖ్యమంత్రి విజయన్ పై కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్వహిస్తున్న దాడులను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) పార్టీ దుబ్బాక మండల కార్యదర్శి సింగిరెడ్డి నవీన డిమాండ్ చేశారు. రాజకీయ కక్షసాధింపు, ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలకు పాల్పడుతూ ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఉపయోగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని తీవ్రంగా ఖండించారు.
దుబ్బాక పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని నవీన మాట్లాడుతూ, దేశంలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈడీ, సీబీఐ వంటి సంస్థలను రాజకీయ ఆయుధాలుగా మార్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందన్నారు. కేరళ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందించిన నాయకుడిగా పేరు తెచ్చుకున్న పినరై విజయన్‌పై ఆధారాలు లేకుండానే ఈడీ దాడులు నిర్వహించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు కొంపల్లి భాస్కర్, సాజిత్, పుట్ట కృష్ణ, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు. పినరై విజయన్‌పై ఈడీ దాడులను వెంటనే నిలిపివేసి రాజకీయ వేధింపులను ఆపాలని వారు డిమాండ్ చేశారు.



