Thursday, May 28, 2026
E-PAPER
Homeతాజా వార్తలురైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజల వరకు కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్

రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజల వరకు కొనుగోలు చేస్తాం: మంత్రి ఉత్తమ్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  : రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు పై ఏర్పాటు చేసిన సమావేశానికి రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి ఈ సమావేశంలో హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల  శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి ఈ పర్యటనలు సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందని, ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఎదురైనా రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిస్తే రైతులు అస్సలు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.రైతులకు  నష్టం జరగనివ్వమని మంత్రి తెలిపారు.రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీస్ శాఖలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ ధాన్యం సేకరణను వేగవంతంగా పూర్తి చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని అన్నారు. నాలుగు, ఐదు రోజులు పాటు ఇసుక వాహనాలను పంట కొనుగోలు కోసం, అన్లోడింగ్ కోసం ఉపయోగించుకోవాలని తెలిపారు. యాసంగి పంట రికార్డ్ స్థాయిలో వచ్చిందని ,వరి ధాన్యం, జాగ్రత్తలు పాటిస్తూ ధాన్యమును గోడౌన్లకు తరలించాలన్నారు. 

రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ సారి వరి ధాన్యం అద్భుతమైన పంటలు పండాయని, రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేయటం జరుగుతుందని ఎవరు ఆందోళన చెందవద్దని అన్నారు. మద్దతు ధర ప్రకటించిన ప్రకారం రైతులు పండించిన ధాన్యాన్ని సేకరిస్తూ అత్యధిక మొత్తంలో డబ్బులు జమ చేయడం జరిగిందని అన్నారు. తడచిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ  ఈసారి వరి ధాన్యం ఎక్కువ దిగుబడి వచ్చిందని, రైతుల పక్షాన ప్రభుత్వం ఉందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 2,75,686.220 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.జిల్లాలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి,జిల్లా సివిల్ సప్లై మేనేజర్ హరికృష్ణ జిల్లా పౌర సరఫరాల అధికారి రోజా రాణి, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి,మండల తాసిల్దార్లు, యం పి ఓ లు,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -