పటాన్‌చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు

పటాన్‌చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు– అతని సోదరుడి నివాసంలోనూ
– ఏకకాలంలో పలుచోట్ల దాడులు
– అక్రమ మైనింగ్‌ వ్యవహారమే కారణమా..?
– చర్చనీయాంశంగా మారిన పారిశ్రామిక ప్రాంతం
నవతెలంగాణ-పటాన్‌చెరు
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఈడీ దాడులు జరిగాయి. గురువారం ఉదయం నుంచే ఈడీ అధికారులు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డితో పాటు బంధువుల ఇండ్లు, వారికి సంబంధించిన కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సుమారు 40 మందికి పైగా అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు అక్రమ మైనింగ్‌, రియల్‌ ఎస్టేట్‌లో భారీఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు ఉండటంతో పాటు పలువురి ఫిర్యాదులతో ఈడీ అధికారులు రంగంలోకి దిగినట్టు సమాచారం. పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామపంచాయతీ పరిధిలో మధుసూదన్‌ రెడ్డికి సంబంధించిన సంతోష్‌ సాండ్‌ మైనింగ్‌ తమకు కేటాయించిన భూమితోపాటు మరో 11 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ అక్రమాలపై విచారణకు సంగారెడ్డి ఆర్డీవో నేతృత్వంలో ప్రత్యేక కమిటీని నియమించింది. అక్రమాలు జరిగినట్టు కమిటీ తేల్చడంతో గూడెం మధుసూదన్‌ రెడ్డిపై కేసు నమోదు చేసి గతంలో అరెస్టు చేశారు. 20 రోజులు సంగారెడ్డి జైల్లో ఉన్న ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. అనధికారికంగా మైనింగ్‌ చేసినందుకుగాను క్రషర్‌ యాజమాన్యానికి మైనింగ్‌ అధికారులు రూ.341 కోట్లపైన పెనాల్టీ విధించారు. దానికి తోడు రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు రావడంతో పాటు అక్రమ మైనింగ్‌పై పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఎమ్మెల్యే, ఆయన బంధువుల నివాసాల్లో సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అక్రమ మైనింగ్‌ వ్యవహారంతో పాటు బినామీ పేర్లపై పెట్టుబడుల గురించి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. సోదాలు పూర్తయితేనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈడీ సోదాలతో పటాన్‌చెరువాడతోపాటు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Spread the love