విద్యారంగ సమస్యలను ఎన్నికల ఎజెండాలో చేర్చాలి

Educational problems It should be included in the election agenda– రాజకీయ పార్టీలకు తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీ విజ్ఞప్తి
– విద్యపట్ల ఆసక్తి చూపని బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు :రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు విద్యారంగ సమస్యలను తమ ఎన్నికల ఎజెండాలో చేర్చాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది. గురువారం తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్‌ కె.లక్ష్మినారాయణ అధ్యక్షతన హైదరాబాద్‌ బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో 2014-15 బడ్జెట్‌ లో 10.89 శాతం కేటాయిస్తే 2023-24లో 6.57 శాతానికి తగ్గించారని ఆ సమావేశం ఆవేదన వ్యక్తం చేసింది. మన ఊరు-మన బడి పథకం కోసం కేటాయించామన్న రూ.7,298 కోట్లలో రూ.440 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించింది. దేశంలో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం 35వ స్థానానికి దిగజారిందని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా, ఇంగ్లాండ్‌ లాంటి దేశాల్లో 18 నుంచి 24 ఏండ్ల వయస్సు కలిగిన వారిలో యువతీ, యువకులు 70 శాతముండగా, మన దేశంలో కేవలం 27 శాతం మందే ఉన్నారని తెలిపింది. దీన్ని కనీసం 50 శాతానికి పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఇందుకోసం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను, కాలేజీలను ప్రోత్సహించాలని సూచించింది. ప్రయివేటు, విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతించవద్దని కోరింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడంతో పాటు పలు డిమాండ్లను రాజకీయ పార్టీల ముందుకు తెచ్చింది.
సంపన్న దేశంలో చదువుకు ఇన్ని ఇబ్బందులా?
భారతదేశం సంపన్న దేశంగా అవతరించిందని ప్రచారం చేసుకుంటున్న బీజేపీ చదువుల కష్టాలను మాత్రం తీర్చడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రజలకు మేలు చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవ తరగతి చదివిన వారిలో 10 శాతం మంది సరిగ్గా ఇంగ్లీషు, తెలుగు రాయగలిగితే మహా ఎక్కువ అన్నట్టుగా పరిస్థితి తయారందని తెలిపారు. పిల్లల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయన్నారు. ఉచిత విద్యను తప్పనిసరి చేయాలని సూచించారు.
టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు, అక్షరాస్యత కొలమానాల్లో రాష్ట్రం అత్యంత వెనుకబడిందని తెలిపారు. సమాజాన్ని కాపాడటానికి విద్యారంగ సమస్యలను పరిష్కరించి బలోపేతం చేయాలని కోరారు. ఆ దిశగా విద్యాపరిరక్షణ కమిటీ చేస్తున్న ప్రయత్నంలో అండగా ఉంటామని తెలిపారు.
రాష్ట్రంలో టెక్నికల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు, నియోజకవర్గానికి ఒక పాలిటెక్నిక్‌, మండలానికి ఒక ఐటీఐని ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. విద్యా పరిరక్షణకమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌ మాట్లాడుతూ సామాజిక మార్పుకు, నిర్మాణానికి విద్య అవసరమని తెలిపారు.
విద్యారంగం బలోపేతం అంశాన్ని ప్రజా ఉద్యమంగా మలచనున్నట్టు చెప్పారు. సమావేశంలో వేములపల్లి వెంకట్రామయ్య (సీపీఐ – ఎంఎల్‌ న్యూడెమోక్రసీ), కె.గోవర్థన్‌ (సీపీఐ -ఎంఎల్‌ న్యూడెమోక్రసీ), ఎం.హన్మేష్‌ (ప్రజాపంథా పార్టీ) పాల్గొని విద్యాపరిరక్షణ కమిటీ డిమాండ్లకు మద్ధతు ప్రకటించారు. ఈ సమావేశంలో కమిటీ ఉద్యమ భాగస్వామ్య సంఘాల నుంచి అశోక్‌, నాగిరెడ్డి (టీపీటీఎఫ్‌), సోమయ్య (డీటీఎఫ్‌), కె.ఎస్‌.ప్రదీప్‌ (పీవైఎల్‌), పి.రామక్రిష్ణ, ఎస్‌.నాగేశ్వర్రావు (పీడీఎస్‌ యూ), పి.మహేశ్‌, పరశురాం (పీడీఎస్‌ యూ) తదితరులు పాల్గొన్నారు.

Spread the love