– ఏడువేల మందితో భద్రత
– పోకిరీలు, చైన్ స్నాచర్లు, పిక్‌ప్యాకెటర్స్‌పై నిఘా
– 4వేల సీసీ కెమెరాలు
– క్యూఆర్ కోడ్ ద్వారా నిమజ్జనం
– మద్యం సేవించి నిమజ్జనానికి రాకండీ.. : రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జీహెచ్‌ఎంసీ, మున్సిపాల్టీ, గ్రామ పంచాయతీ మూడు రకాల కలయిక ఉంటుందన్నారు. నిమజ్జన కార్యాక్రమం సందర్భం గా పెద్దఎత్తున ప్రజలు, నిర్వాహకులు తరలివచ్చే అవకాశముందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని చెప్పారు. మంగళవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో మీడియా సమావేశంలో సీపీ వివరాలు వెల్లడించారు.
గణేష్ ఉత్సవాల కోసం నెల రోజుల ముందు నుంచే సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. నిర్వాహకులు, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులతోపాటు, ఇతర శాఖలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నామని, పోలీస్ శాఖ నుంచి కొన్ని మార్గదర్శకాలను అందించామని అన్నారు. వినాయక విగ్రహాలను ప్రతిష్టించడానికి ముందు నిర్వాహకుల నుంచి ఇంటిమేషన్ ఫామ్ తీసుకున్నామని తెలిపారు. దాంతో ఎన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత ఉందని, నిమజ్జనం ఏర్పాట్లు, రూట్ మ్యాప్‌కు సులువైందన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గతేడాది 9 వేల విగ్రహాలను ప్రతిష్టిస్తే.. ఈసారి 11 వేల విగ్రహాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అనధికారికంగా ఇండ్లల్లో మరో 20, 25వేల విగ్రాహాలుండే అవకాశముందన్నారు. రాచకొండ పరిధిలో దాదాపు 4000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలతోపాటు మండపాల సమీపంలో దాదాపు 228 పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. 6000మంది పోలీస్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశామని, అదనంగా మరో 1000 మంది ఫోర్సును అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు.
రాచకొండ పరిధిలో 56 చెరువులు, కుంటలుండగా, అందులో కాప్రా, సఫిల్‌గూడా, సరూర్‌నగర్, ఉప్పల్ తదితర 11 ప్రాంతాల్లో పెద్ద చెరువులున్నాయని తెలిపారు. పలు ప్రాంతాలల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోవుంటాయని, సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. పోలీస్ శాఖతోపాటు జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, విద్యుత్‌శాఖ తదితర శాఖల సిబ్బంది రెండు షిఫ్టుల్లో పనిచేస్తారన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. క్రేయిన్ ఆపరేటర్లు, డ్రైవర్లు, రిపేయిర్ చేసేందుకు మెకానిక్‌లను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. ఊరేగింపు సమయంలో మార్గమధ్యలో నిర్వాహకులు విగ్రహాలను విడిచివెళ్లొదని సూచించారు. పోకిరీలు, చైన్ స్నాచర్లు, పిక్‌ప్యాకెటర్స్ ఆగడాలను అరికట్టేందుకు షీబృందాలు, క్రైమ్‌టీమ్‌లు పనిచేస్తాయని, మఫ్టీలో ఉంటాయని తెలిపారు. మద్యం సేవించి నిమజ్జనానికి రావద్దన్నారు. నిమజ్జనాన్ని వీక్షించేందుకు పలు ప్రాంతాల్లో పెద్దపెద్ద డిస్‌ప్లేలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నిమజ్జన ఘాట్ల వరకు ఇతర వాహనాలకు అనుమతిలేదన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి సేకరించేందుకు అందరూ సహకరించాలని, వందతులు సృష్టించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.