ఎన్నికలు ముంచుకొస్తున్నాయి

Elections are approaching– మమ్మల్నేం చేయమంటారు ?
– చంద్రబాబుకు కాసాని అభ్యర్థన
– రాజమండ్రి జైలుకు లేఖ
– పోటీ వద్దనుకుంటే ప్రత్యామ్నాయ ఆలోచన ?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తెలంగాణలో ఎన్నికల వాతావరణం ఊపందుకుంది. అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు ఉత్సాహంగా అభ్యర్థులను ప్రకటిస్తూనే మరోవైపు ప్రచారం సైతం నిర్వహిస్తున్నాయి. కప్పదాట్ల జోరు పెరిగింది. అన్నీ పార్టీల్లో హడావిడి కనిపిస్తున్నది. అయితే టీడీపీలో మాత్రం నైరాశ్యం నెలకొంది. పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న నేపథ్యంలో తెలంగాణ టీడీపీలో రాజకీయ నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చి దాదాపు మూడు వారాలు దాటింది. నవంబరు 30 పోలింగ్‌ తేదీగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన తరుణంలో తెలంగాణ టీడీపీ సమస్యల్లో ఇరుక్కుపోయింది. పోటీచేసే విషయమై కూడా అనుమానా లు వ్యక్తమవుతున్నాయి. కచ్చితంగా ఎన్నికల బరిలో ఉంటామని ఆ పార్టీ సీనియర్‌ నేతలు చెబుతున్నా, ఆచరణలో ఆ కదలికలు కనిపించకపోవడంతో క్యాడర్‌లో అసంతృప్తి కనిపిస్తున్నది.. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ ఇప్పటికే చంద్రబాబును ఒకసారి జైలులో ములాఖాత్‌కు పోయి కలిసినా స్పష్టత రాలేదు. ఈలోపు ఆపార్టీలో అంతర్గతంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. టికెట్లు, భీ-పారాలు అంటూ నేతలు కాసానిపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో శుక్రవారం మరోసారి ములాఖాత్‌ కోసం వెళ్లాలని కాసాని నిర్ణయించు కున్నారు. ఈమేరకు ఏపీ టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కాసాని రెండు రోజుల క్రితం పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు తీసుకున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు 89 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. వీటి కోసం సుమారు 189 మంది పేర్లతో జాబితా తయారు చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం ములాఖాత్‌కు వెళ్లే సమయంలో ఆయనకు నివేదిక అందజేయ నున్నారు. ఈనెల 29లోపు స్పష్టత వస్తుందని కాసాని భావిస్తున్నారు. హైదరాబాద్‌, ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో మినహా మిగతా అన్ని చోట్లా రంగం లోకి దిగేందుకు సన్నాహాలతో సిద్ధంగా ఉన్నామని చంద్రబాబుకు చెప్పనున్నట్టు సమాచారం. ఈనేపథ్యంలో ఇప్పటికే రాజమండ్రి జైలుకు ప్రత్యేకంగా లేఖ రాశారు. పార్టీ జాతీయ కార్యదర్శి కాసాని విరేష్‌ ద్వారా ఆ లేఖను గురువారం సాయంత్రం చంద్రబాబుకు అందజేసేలా జైలర్‌కు ఇచ్చారు. నిర్ణయం చంద్ర బాబుకు వదిలేయాలని కాసాని భావిస్తున్నారు. ఓడినా, గెలిచినా రాష్ట్రంలో ఎక్కువ మంది బీసీలకు టికెట్లు కేటాయించాలనే పట్టుదలతో కాసాని ఉన్నారు. ఒకవేళ తెలంగాణలో పోటీ వద్దని చంద్రబాబు చెబితే మాత్రం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేందుకు కాసాని సంసిద్ధులవుతున్నట్టు తెలిసింది.

Spread the love