అశ్వారావుపేట నియోజకవర్గానికి నాలుగో సారి ఎన్నికలు…

అశ్వరావుపేట నియోజకవర్గ ముఖచిత్రం
అశ్వరావుపేట నియోజకవర్గ ముఖచిత్రం
– నాలుగో సారి జరగనున్న ఎన్నికలు
– మహిళా ఓటర్లు ఏ అధికం
– మొత్తం ఓటర్లు 1,53,757 
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా సత్తుపల్లి నియోజక వర్గంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతాన్ని 2009 లో అశ్వారావుపేట నియోజకవర్గం కేంద్రంగా ఏర్పాటు చేసారు. సత్తుపల్లి నియోజక వర్గం లోని అశ్వారావుపేట, దమ్మపేట, కొత్తగూడెం నియోజకవర్గంలోని ములకలపల్లి, చండ్రుగొండ, భూర్గంపాడ్ నియోజక వర్గంలోని కుక్కునూరు, వెలేరుపాడు మండలాలతో ఆరు మండలాలతో 118 నెంబర్ తో  అశ్వారావుపేట కేంద్రంగా 186 పోలింగ్ కేంద్రాల తో 1,53,271 ఓటర్ల తో గిరిజన (ఎస్.టి)  నియోజక వర్గం రూపుదిద్దుకుంది. మొదటి దఫా జరిగిన ఎన్నికల్లో  1,53,271 మంది ఓటర్లు కు గాను 1,25,444 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  2014 జూన్ 02 న రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయింది. అనంతర కాలంలో నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటులో భాగంగా ఈ నియోజకవర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోకి విలీనం అయింది.
నూతన మండలాలు ఏర్పాటులో భాగంగా అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, చండ్రుగొండ లోని కొంత భాగాన్ని అన్నపురెడ్డిపల్లి మండలంగా విభజించి అయిదు మండలాలతో తెలంగాణలో రెండో సారి నియోజక వర్గం రూపొందింది. అయితే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలను పోలవరం ముంపు ప్రాంతంగా గుర్తించడంతో ఈ రెండు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. అశ్వారావుపేట నియోజక వర్గం గా రెండోసారి, తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారి జరిగిన 2014 ఎన్నికల్లో అయిదు మండలాలు,204 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,67,503 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,43,782 మంది ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. 2018 లో నియోజక వర్గంగా మూడో సారి, తెలంగాణాలో రెండో సారి 5 మండలాలు,164 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,43,960 మంది ఓటర్లు ఉండగా 1,24,747 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వచ్చే నెల అక్టోబర్ లో జరుగనున్న ఎన్నికల్లో 5 మండలాలు,184 పోలింగ్ కేంద్రాల పరిధిలో 1,53,757 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 75,080 కాగా స్త్రీలు 78,671 మంది, ఇతరులు 6 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు కంటే మహిళా ఓటర్లు 3,591 మంది అధికంగా ఉండటం విశేషం.
Spread the love