చట్టాలను తుంగలో తొక్కుతున్న యాజమాన్యాలు

చట్టాలను తుంగలో తొక్కుతున్న యాజమాన్యాలు– ప్రమాదాలు జరిగితే తప్ప పట్టించుకోని అధికార యంత్రాంగం
– సౌత్‌ గ్లాస్‌ కంపెనీ యజమానిని అరెస్టు చేయాలి : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
– సౌత్‌ గ్లాస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమ సందర్శన, బాధితులకు పరామర్శ
నవతెలంగాణ-షాద్‌నగర్‌
పరిశ్రమల యాజమాన్యాలు కార్మిక చట్టాలను నీరు గారుస్తూ, కార్మికులతో పన్నెండు గంటల పని చేయించు కుంటూ చాలీచాలని వేతనాలిస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని బూర్గుల శివారులోని సౌత్‌ గ్లాస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమను సీఐటీయూ బృందం శనివారం సందర్శించింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించింది. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించింది. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే తప్పా అధికార యంత్రాంగం ఆ వైపు చూడటం లేదన్నారు. పరిశ్రమలకు అనుమతి ఇచ్చినప్పుడే అన్నీ చూసుకుని ఇవ్వాలని, నామమాత్రంగా అధికార యంత్రాంగం తనిఖీలు చేయడం సరైంది కాదని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుదెరువు నిమిత్తం వచ్చిన వారితో 12 గంటలు రూ.300, రూ.400 రోజువారీ కూలికి పని చేయించుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌత్‌ గ్లాస్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారు ఐదుగురు కార్మికులే అంటున్నారు కానీ.. ఇంకా లోపల మృతదేహాలు న్నాయని తోటి కార్మికులు చెబుతున్నారని అన్నారు. ఈ విషయంపై నిజనిర్ధారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇకనైనా కార్మిక చట్టాలను కఠినంగా అమలు పరచాలని కోరారు. కంపెనీ యజమాని శైలేష్‌కుమార్‌ గుప్తాని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. అంగ వైకల్యం పొందిన కార్మికులకు రూ.25 లక్షలు, చికిత్స పొందుతున్న కార్మికులకు రూ.పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని అన్నారు. అందరూ అంతర్రాష్ట్ర వలస కార్మికులే కాబట్టి 1979 అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం ప్రకారంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లు సరైన తనిఖీలు చేయడం లేదని, యాజమాన్యాల ప్రలోభాలకు లొంగి చూసీచూడనట్టు ఉండటం వల్లే ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ డిపార్ట్‌మెంట్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్మిక శాఖ ఉన్నతా ధికారులు తగిన చర్యలు తీసుకోవాలని లేదంటే సీఐటీయూ దశలవారీ ఉద్యమ కార్యా చరణ చేపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎన్‌.రాజు, కార్యదర్శి చంద్రమోహన్‌, ఉపాధ్యక్షు లు బిసా సాయిబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్‌, జిల్లా కోశాధికారి కవిత,నాట్కో ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు మల్లేష్‌, కార్యదర్శి కిరియా నాయక్‌, నాయకులు శ్రీకాంత్‌, అశోక్‌, ఈశ్వర్‌నాయక్‌, చంద్రమౌళి, కావలి రాజు, బేరి శ్రీనివాస్‌, మైలారం జంగయ్య ఉన్నారు.

Spread the love