వేయకుంటే తిండి గింజలు ఎట్లా అంటున్న రైతులు
ఎల్నినో ఎఫెక్ట్ తో నష్టపోతారంటున్న అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా సమానంగా కురవడం లేదు. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. రైతులు మళ్లీ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. విత్తనాలు, ఎరువులు వేసినా సరిపడా తేమ లేక పంటల ఎదుగుదల మందగిస్తోంది. దీంతో వాతావరణ నిపుణులు ఎల్ నినో ప్రభావాన్ని గమనిస్తూ పరిస్థితిని పరిశీలిస్తూ రైతులకు సూచనలు ఇస్తున్నారు. మండలంలో ఇప్పటికీ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.
వరిసాగుకే ప్రాధాన్యత..
ఈ వానాకాలంలో ఎల్నినో ప్రభావం ఉందని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరించారు. పంటల మార్పిడి చేపట్టాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపారు. మండలంలో ఈ నెలలో సుమారు 10 నుంచి 20 మిల్లీమీటర్ల సగటు వర్ష పాతం మాత్రమే నమోదైంది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనా రైతులు ఏమాత్రం తగ్గకుండా వరి సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వరి సాగు తగ్గుతుందని అధికారులు భావించారు. గతేడాది మండల వ్యాప్తంగా 22,300 వేల ఎకరాల్లో సాగు కాగా ఇందులో వరి 15,300 ఎకరాల్లో, 3600 ఎకరాల్లో పత్తి, 2500 ఎకరాల్లో మిర్చి పంటలను రైతులు సాగు చేశారు. ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 10 వేల ఎకరాల్లో వరి వేశారు. మరో 2 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు.
వ్యవసాయ శాఖ సూచనలు..
వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేసుకోవాలని, పంటల సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నేలల్లో తేమ నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలంటున్నారు. వర్షాల అంచనాలను గమనిస్తూ రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. రైతుల్లో మాత్రం ఒకటే ఆశ..వరుణుడు కరుణిస్తే పంటలు నిలబడతాయని. పంట పండితే తిండి గింజలైనా దక్కుతాయని అంటున్నారు. కానీ వర్షాలు కురవకపోతే పెట్టుబడుల కోసం చేసిన అప్పులు నష్టాల రూపంలో రైతులను మరింత ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆరుతడే మేలు: శ్రీజ, మండల వ్యవసాయాధికారి
ఇప్పటికే రైతులకు ఆరుతడి పంటలు వేయాలని అవగాహన కల్పించాం. నీటి వసతి ఉన్నచోట రైతులు వరి సాగు చేస్తున్నారు. నీరు అందుబాటులో లేకున్నా వరి వేస్తే ఎల్నినోతో నష్టపోతారు. ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసు కుంటే లాభదాయకంగా ఉంటుంది.



