స్మార్ట్‌ సిటీ మిషన్‌ గడువు పొడిగింపు

Smart City Mission Extension of time– సీఎం రేవంత్‌రెడ్డి చొరవతో స్పందించిన కేంద్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్మార్ట్‌ సిటీ మిషన్‌ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ నెల 24న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను కలిసి స్మార్ట్‌ సిటీ మిషన్‌ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్‌ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా కేంద్ర ప్రభుత్వ ం నిర్ణయించిన గడువు ప్రకారం స్మార్ట్‌ సిటీ మిషన్‌ కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. వరంగల్‌, కరీంనగర్‌ నగరాల్లో స్మార్ట్‌ మిషన్‌ పనులు చేపట్టారు. వరంగల్‌లో ఇప్పటివరకు 45 పనులు పూర్తయ్యాయి. రూ. 518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతు న్నాయి. కరీంనగర్‌లో 25 పనులు పూర్తయ్యాయి. రూ. 287 కోట్లతో చేపట్టిన 22 పనులు కొనసాగుతు న్నాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పనులు పూర్తికానందున ప్రజల ప్రయోజనార్థం మేరకు పథకం గడువును పొడిగించాలని కోరారు. దీంతో ఆ పథకాన్ని 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ శనివారం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను కొనసాగించాల నీ, కొత్త పనుల మంజూరు ఉండవని స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ పద్ధతిన విడుదల చేయనున్నది. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని సూచించింది.

Spread the love